PM Modi: జార్ఖండ్‌ను దోచుకున్న సోరెన్ సర్కార్
ABN , Publish Date - Nov 10 , 2024 | 03:50 PM
మరో రెండు రోజుల్లో జార్ఖండ్ అసెంబ్లీకి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం బోకారోలో ఎన్నికల ప్రచారంలోభాగంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్, జేఎంఎం భాగస్వామ్య ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు గుప్పించారు.
రాంచీ, నవంబర్ 10: హేమంత్ సోరెన్ సారథ్యంలోని సర్కార్.. జార్ఖండ్ రాష్ట్రాన్ని భారీగా దోచుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అవినీతి పరులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బోకారోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్ ముక్తి మోర్చ (జేఎంఎం), కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో అక్రమంగా దోచుకున్న భారీ నగదును రికవరీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నగదును జార్ఖండ్ ప్రజలతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇసుక అక్రమ మైనింగ్ ద్వారా జేఎంఎం నేతలు కోట్లాది రూపాయిలను అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. దీంతో ఆయా పార్టీల నేతల వద్ద భారీగా నగదు చేరిందన్నారు.
ఈ నగదంతా వారి వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇదంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే 2014 అనంతరం జార్ఖండ్ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించిన విషయాన్ని ఈ సందర్బంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. గత యూపీఏ హయాంలో కేవలం రూ. 80 వేల కోట్ల నిధులు మాత్రమే జార్ఖండ్ రాష్ట్రానికి కేటాయించిందని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రానికి తమ ప్రభుత్వం రూ.3 లక్ష కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
తద్వారా జార్ఖండ్‌కు కేంద్రంలోని తమ ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని ఆయన సోదాహరణగా వివరించారు. జార్ఖండ్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీక్‌తోపాటు రిక్రూట్‌మెంట్ మాఫియా చేస్తున్న ఆగడాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ వివరించారు.
ఈ పేపర్ లీక్, రిక్రూట్‌మెంట్ మాఫియాలను సృష్టించిందే జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల భాగస్వామ్య ప్రభుత్వనిదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆరోపించారు. దీంతో జార్ఖండ్ యువత బంగారు భవిష్యత్తకు గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించి.. వారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా.. నవంబర్ 13, 20వ తేదీన జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్న సంగతి తెలిసిందే.
For National news And Telugu News