Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Jul 04 , 2024 | 05:24 PM
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జులై 7వ తేదీన ఆయన సీఎంగా..
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జులై 7వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణం చేయొచ్చని వార్తలు వచ్చాయి కానీ, నాటకీయ పరిణామాల మధ్య ఆయన జులై 4నే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha) (జేఎమ్ఎమ్) పితామహుడైన హేమంతో సోరెన్ తండ్రి, మాజీ సీఎం శిభు సోరెన్ (Shibu Soren) హాజరయ్యారు.
కాగా.. భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలతో హేమంత్ సోరెన్ జనవరిలో అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనని అరెస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఆయన స్థానంలో జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ (Champai Soren) బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కుంభకోణంలో హేమంత్‌ది ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు రికార్డులు లేకపోవడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇలా జైలు నుంచి బయటకొచ్చిన హేమంత్‌ను మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా మద్దతు లభించింది.
ఈ తరుణంలోనే చంపై సోరెన్ బుధవారం తన సీఎం పదవికి రాజీనామా చేసి, గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు.. గురువారం హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన్ను గవర్నర్ ఆహ్వానించగా.. సాయంత్రం 5 గంటలకే హేమంత్ ప్రమాణస్వీకారం చేసేశారు. కాగా.. తనను సీఎం పదవి నుంచి తప్పించడంపై చంపై సోరెన్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అంతేకాదు.. జేఎంఎం పార్టీ మీటింగ్‌లోనూ తనకు అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Read Latest National News and Telugu News