Hero Vishal: విజయ్ బాటలో హీరో విశాల్.. కొత్త పార్టీ దిశగా అడుగులు?
ABN , First Publish Date - 2024-02-07T12:11:01+05:30 IST
యువ నటుడు విశాల్(Vishal) కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?.. ఆయన కూడా నటుడు విజయ్(Actor Vijay) బాట పట్టనున్నారా?.. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించేందుకు కసరత్తు మొదలుపెట్టారా?.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

ప్యారీస్(చెన్నై): యువ నటుడు విశాల్(Vishal) కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?.. ఆయన కూడా నటుడు విజయ్(Actor Vijay) బాట పట్టనున్నారా?.. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించేందుకు కసరత్తు మొదలుపెట్టారా?.. అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో ఇటీవల కొత్త పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్ రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన బాటలోనే విశాల్ కూడా రాజకీయ పార్టీ త్వరలోనే ప్రారంభించే పనుల్లో దిగారని, ఆయనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉత్తర చెన్నైలోని ఆర్కే నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ సమర్పించిన నామినేషన్ పత్రాలు తోసివేతకు గురైన విషయం తెలిసిందే. దీంతో తన అభిమాన సంఘాన్ని ఆయన ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’గా పేరు మార్చి జిల్లాలవారీగా నిర్వాహకులను, బూత్ కమిటీలను కూడా నియమించారు. పలు ప్రాంతాల్లో జరిగే షూటింగుల్లో పాల్గొంటున్న విశాల్.. ఆ ప్రాంతంలో ఉన్న అభిమానులతో సమావేశం కావడంతో పాటు గ్రామ ప్రజలను పలకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండడంతో రాజకీయ పార్టీని ప్రారంభించే దిశగా విశాల్ అడుగులేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను త్వరలో చెన్నైకి ఆహ్వానించి, వారితో చర్చించిన మీదట.. పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది.