Share News

అండమాన్‌ దగ్గర 6 టన్నుల డ్రగ్స్‌

ABN , Publish Date - Nov 26 , 2024 | 03:20 AM

భారత తీర గస్తీ దళం అండమాన్‌ దీవుల దగ్గర భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని సోమవారం అధికారులు వెల్లడించారు.

అండమాన్‌ దగ్గర 6 టన్నుల డ్రగ్స్‌

విలువ రూ.25 వేల కోట్లు

ఆరుగురు మయన్మార్‌ జాతీయుల అరెస్టు

తీర గస్తీ దళం నిఘా విమానం ద్వారా గుర్తింపు

పోర్టుబ్లెయిర్‌, నవంబరు 25: భారత తీర గస్తీ దళం అండమాన్‌ దీవుల దగ్గర భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఆరు టన్నుల(6వేల కిలోల) ఈ మాదక ద్రవ్యాల(కాంట్రాబాండ్‌ మెథంఫెటమైన్‌) విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.25000 కోట్లు ఉంటుందని అంచనా. వీటిని ఒక్కోటి రెండేసి కేజీల చొప్పున 3000 ప్యాకెట్లుగా తయారుచేసి తరలిస్తున్నారు. ఈ నెల 23న అండమాన్‌ దీవుల వద్ద పహరా కాస్తున్న తీర గస్తీ దళం విమానం(డార్నియర్‌) పైలెట్‌ బ్యారెన్‌ దీవి దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న చేపల వేట ట్రాలర్‌ని గుర్తించారు. వెంటనే ఆ ట్రాలర్‌లో ఉన్నవారిని దాన్ని ఆపాలని హెచ్చరించి, అండమాన్‌, నికోబార్‌లోని తమ కమాండ్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో దగ్గరలో ఉన్న తీర గస్తీదళం పడవలు వేగంగా అక్కడికి చేరుకుని ఆ ట్రాలర్‌ని పోర్ట్‌బ్లెయిర్‌కి తీసుకువచ్చాయి. అందులో ఉన్న ఆరుగురు మయన్మార్‌ జాతీయులను అరెస్టు చేశారు. ట్రాలర్‌లో ఉన్న మాదక ద్రవ్యాలను భారత్‌, దాని పొరుగు దేశాలకు సరఫరా చేసేందుకే తరలిస్తున్నారని భావిస్తున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:20 AM