Share News

2029 నుంచే జమిలి ప్రక్రియ?

ABN , Publish Date - Dec 18 , 2024 | 04:03 AM

లోక్‌సభలో కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి సవరణలూ లేకుండా ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై న్యాయనిపుణుల మధ్య చర్చ జరుగుతోంది.

2029 నుంచే జమిలి ప్రక్రియ?

లోక్‌సభ పదవీకాలానికి అనుగుణంగానే అసెంబ్లీల పదవీకాలం

129వ రాజ్యాంగ సవరణ బిల్లులో పలు కీలక అంశాలు

న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఎలాంటి సవరణలూ లేకుండా ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై న్యాయనిపుణుల మధ్య చర్చ జరుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 82కు చేర్చిన సవరణలో.. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ మొదటి సిటింగ్‌ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేస్తారని, ఆ నోటిఫికేషన్‌ తేదీని సభ నియామక తేదీగా నిర్ణయిస్తారని పేర్కొనడం గమనార్హం. దీంతో 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాతే జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. నియామక తేదీ నుంచి ఐదు సంవత్సరాల పాటే లోక్‌సభ పదవీకాలం ఉంటుంది.

నియామక తేదీ తర్వాత ఏర్పడే అసెంబ్లీల పదవీకాలం కూడా లోక్‌సభ పూర్తి పదవీకాలంతో పాటు ముగుస్తుందని తెలిపింది. అలాగే.. ఒక శాసనసభ పదవీకాలం రద్దయితే మిగిలిన కాలానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు స్పష్టం చేసింది. ఏ అసెంబ్లీకైనా ఎన్నికలు నిర్వహించలేకపోతే ఆ ఆసెంబ్లీ ఎన్నికలు తర్వాత జరిగినా దాని పదవీకాలం లోక్‌సభ పదవీకాలానికి అనుగుణంగానే ఉంటుందని బిల్లు పేర్కొంది. కాగా, ఎన్నికల నిర్వహణకు భారీగా ఖర్చు కావడం, అత్యధిక సమయం పట్టడం, దేశంలో అనేక ప్రాంతాలలో ప్రవర్తన నియమావళి అమలు వల్ల అభివృద్ధి దెబ్బతినడం, సాధారణ ప్రజాజీవనానికి విఘాతం కలగడం, ఉద్యోగులను సుదీర్ఘకాలంపాటు ఎన్నికల నిర్వహణకు నియమించాల్సి రావడం వంటి కారణాల వల్ల జమిలి ఎన్నికలు తప్పనిసరిగా భావించినట్లు బిల్లులో వివరించారు.

Updated Date - Dec 18 , 2024 | 04:03 AM