Bengaluru: ప్రజ్వల్‌పై లుక్ అవుట్ నోటీసు
ABN , Publish Date - May 03 , 2024 | 04:09 AM
డీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.
విచారణకు రాకుంటే అరెస్టు చేస్తాం
కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర హెచ్చరిక
ప్రజ్వల్‌పై మరో మహిళ ఫిర్యాదు
బెంగళూరు, మే 2(ఆంధ్రజ్యోతి): జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతనిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హొళె నరసీపుర పోలీ్‌సస్టేషన్‌లో ప్రజ్వల్‌తోపాటు ఆయన తండ్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే ప్రజ్వల్ దేశం విడిచి పరారయ్యారు.
ఈ నేపథ్యంలో 24 గంటల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని సిట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. అయితే, తాను జర్మనీలో ఉన్నానంటూ ప్రజ్వల్ న్యాయవాదుల ద్వారా ఏడు రోజుల గడువు కోరారు. ఆ విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ గురువారం అతనిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు లుక్ అవుట్ నోటీసులు పంపారు. లుక్ అవుట్ నోటీసు తర్వాత కూడా ప్రజ్వల్ ఆచూకీ లభించకపోతే.. కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. కాగా, ప్రజ్వల్ గడువులోగా విచారణకు హాజరు కాకుంటే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర హెచ్చరించారు.
కలబురగిలో పరమేశ్వర గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజ్వల్ వద్ద దౌత్య పాస్‌పోర్ట్ ఉన్నందునే రాత్రికి రాత్రి దేశం విడిచి వెళ్లగలిగారని చెప్పారు. కాగా, ప్రజ్వల్ తనపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ హొళెనరసీపుర పోలీ్‌సస్టేషన్‌లో గురువారం మరో మహిళ ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ప్రజ్వల్ రాసలీలల వీడియోలు లీక్ చేసిన ఆయన మాజీ డ్రైవర్ కార్తీక్.. సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అదృశ్యమయ్యారు. ప్రస్తుతం మలేసియాలో ఉన్న కార్తీక్ మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలు, ఫొటోలను తాను బీజేపీ నేత దేవరాజె గౌడకు తప్ప మరెవ్వరికీ ఇవ్వలేదని ఆ వీడియో సందేశంలో కార్తీక్ పేర్కొన్నారు.