Madhya Pradesh: ఇల్లు కూల్చడం ఫ్యాషన్ అయ్యింది.. లక్ష పరిహారం కట్టండి.. హైకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Feb 10 , 2024 | 09:42 PM
బుల్డోజర్‌తో ఒక ఇంటిని కూల్చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో విధివిధానాలను పాటించకుండా ఇళ్లను కూల్చడం ఒక ఫ్యాషన్ అయిపోయిందంటూ చురకలు అంటించింది. ఉజ్జయినిలో మునిసిపల్ అధికారులు తన ఇంటిని తప్పుగా కూల్చివేశారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇండోర్ బెంచ్.. ఈ మేరకు మండిపడింది.
బుల్డోజర్‌తో ఒక ఇంటిని కూల్చేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో విధివిధానాలను పాటించకుండా ఇళ్లను కూల్చడం ఒక ఫ్యాషన్ అయిపోయిందంటూ చురకలు అంటించింది. ఉజ్జయినిలో మునిసిపల్ అధికారులు తన ఇంటిని తప్పుగా కూల్చివేశారంటూ ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇండోర్ బెంచ్.. ఈ మేరకు మండిపడింది. అంతేకాదు.. ఆ మహిళ ఇంటిని కూల్చినందుకు గాను రూ.1 లక్ష నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఉజ్జయినిలో రాధా లాంగ్రీ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. అయితే.. ఇటీవల స్థానిక మునిసిపల్ అధికారులు పొరపాటున ఆమె ఇంటికి కూల్చివేశారు. ఆ సమయంలో ఎంతగా వేడుకున్నా.. అధికారులు పట్టించుకోకుండా ఇంటిని ధ్వంసం చేశారు. దీంతో.. ఆమె హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ వివేక్ రుషియా ధర్మాసనం.. మునిసిపల్ అధికారులపై తారాస్థాయిలో నిప్పులు చెరిగింది. స్థానిక పరిపాలన, స్థానిక సంస్థలు సహజ న్యాయ విధానాలను ఏమాత్రం పాటించకుండా.. ఏదైనా ఇంటిని కూల్చివేసి వార్తాపత్రికలో ప్రచురించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇతర మార్గాలేవీ లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఇంటిని కూల్చడాన్ని చివరి మార్గంగా ఎంపిక చేయాలని.. అది కూడా ఇంటి యజమానికి క్రమబద్ధీకరించడానికి సరైన అవకాశం ఇచ్చిన అనంతరమే కూల్చివేత చేపట్టాలని ఆదేశించింది. ఎవరైతే రాధా లాంగ్రీ ఆస్తిపై నకిలీ పత్రాలు తయారు చేశారో.. ఆ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. అలాగే.. ఆమె ఆస్తిని ధ్వంసం చేసినందుకు రూ.1 లక్ష వెంటనే చెల్లించాలని పేర్కొంది. ఇదే సమయంలో.. సరైన అనుమతి లేకుండా లేదా నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు ఎవరికీ లేదని కూడా ధర్మాసనం సూచించింది.
ఇదిలావుండగా.. ఈ మధ్య కాలంలో అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో అనేక ఇళ్లను, ఇతర ఆస్తులను కూల్చివేయడం జరిగింది. వీరిలో ఎక్కువమంది నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులే ఉన్నారు. ఏదేమైనా.. ఒకరు చేసిన తప్పుకు మొత్తం కుటుంబాన్నే శిక్షించడం సరైంది కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కూల్చివేతలను సవాలు చేస్తూ కోర్టులకెక్కారు. వీటిల్లో చాలా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.