Delhi: ఆత్మహత్య కారణాల్లో వేధింపులే సరిపోవు.. భార్యాభర్తల కేసులో సుప్రీం కీలక తీర్పు
ABN , Publish Date - Feb 29 , 2024 | 03:08 PM
ఒక వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాల్లో వేధింపులు మాత్రమే సరిపోవని ఆత్మహత్యకు దారితీసిన క్రియాశీల చర్య లేదా ప్రత్యక్ష చర్య కూడా అవసరమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఓ భార్య తరఫు బంధువులు వేసిన కేసు, ప్రతిగా భర్త వేసిన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది.
ఢిల్లీ: ఒక వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాల్లో వేధింపులు మాత్రమే సరిపోవని ఆత్మహత్యకు దారితీసిన క్రియాశీల చర్య లేదా ప్రత్యక్ష చర్య కూడా అవసరమని సుప్రీం కోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఓ భార్య తరఫు బంధువులు వేసిన కేసు, ప్రతిగా భర్త వేసిన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది. వేధింపులు లేదా క్రూరత్వానికి తగిన సాక్ష్యాధారాలు లేని పక్షంలో పెళ్లయిన ఏడేళ్లలోపు భార్య ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని కోర్టు స్పష్టం చేసింది. హరియాణాకు చెందిన ఓ జంట 1992లో వివాహం చేసుకుంది.
పెళ్లయిన నాటి నుంచి భర్త, అత్తమామలు వరకట్నం కోసం ఆమెను వేధించేవారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. భర్త రేషన్ దుకాణం ప్రారంభించడం కోసం భార్యపై ఒత్తిడి తెచ్చాడు. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక 1993 నవంబర్ 19న సదరు మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 1998లో కర్నాల్ అదనపు సెషన్స్ జడ్జి, పంజాబ్, హరియాణా హైకోర్టులు భర్తను దోషిగా నిర్ధారించాయి.
కోర్టు తీర్పును సవాలు చేస్తూ భర్త సుప్రీం మెట్లు ఎక్కాడు. రెండున్నర దశాబ్దాలుగా నడిచిన ఈ కేసులో ఫిబ్రవరి 29న జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పెళ్లయిన ఏడేళ్లలోపు మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాన్ని నియంత్రించే చట్టానికి సంబంధించిన సరైన సూత్రాలను అమలు చేయడంలో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
ఆత్మహత్య ప్రేరేపణ ప్రాతిపాదికన వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని క్రూరత్వం, హింసించడం జరిగిందో లేదో తెలుసుకోవడంలో కోర్టులు జాగ్రత్తగా ఉండాలని బెంచ్ సూచించింది. అప్పీలుదారుడికి 1993లో కష్టాలు మొదలై 30 సంవత్సరాలపాటు కొనసాగి 2024లో ముగుస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలం అతను అనుభవించిన మానసిక వేధనకు సంబంధించి "నేర న్యాయ వ్యవస్థ విధించిన శిక్ష"గా కోర్టు అభిప్రాయపడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి