Share News

మోదీ కా పరివార్‌!

ABN , Publish Date - Mar 05 , 2024 | 03:53 AM

గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని ఎద్దేవాచేసి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ బీజేపీకి మంచి ప్రచారాస్త్రాన్ని అందించారు.

మోదీ కా పరివార్‌!

వచ్చే ఎన్నికల్లో ఇదే బీజేపీ నినాదం!

మోదీకి కుటుంబమే లేదన్న లాలూ వ్యాఖ్యలపై ఫైర్‌

దేశమే తన కుటుంబమన్న ప్రధాని మోదీ

ఎక్స్‌’లో తమ పేర్ల చివర ‘పరివార్‌’ చేర్చినకేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు

న్యూఢిల్లీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అని ఎద్దేవాచేసి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ బీజేపీకి మంచి ప్రచారాస్త్రాన్ని అందించారు. తాజాగా ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌.. కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్న మోదీకి కుటుంబమే లేదని పట్నాలో ఆదివారం వ్యాఖ్యానించారు. అంతే.. అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతామన్‌ వంటి కేంద్ర మంత్రుల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సీనియర్‌ నేతల వరకు.. తమను తాము మోదీ కుటుంబంగా పేర్కొంటూ సోమవారం ‘ఎక్స్‌’లో తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్‌’ అన్న నినాదాన్ని చేర్చారు. వచ్చే ఎన్నికలకు ఇది వారి ప్రచారాస్త్రంగా మారింది. అటు ప్రధాని కూడా తెలంగాణలో జరిగిన సభలో లాలూ వ్యాఖ్యలపై స్పందించారు. యావద్దేశం తన కుటుంబమేనని ఉద్ఘాటించారు. ‘నా జీవితం తెరచిన పుస్తకం. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే. ఏ తోడూ లేనివారికి మోదీ ఉన్నాడు. మోదీకి వారంతా ఉన్నారు. నా యావజ్జీవితం పేదలకు అంకితం’ అని తెలిపారు. ప్రస్తుతం దేశమంతటా ఇదే చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎన్నికల ముంగిట బీజేపీ చేతికి ఆర్‌జేడీ గట్టి అంశాన్ని ఇచ్చిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 2019 ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ రాఫెల్‌ జెట్ల కొనుగోలుపై ఆరోపణలు చేస్తూ ‘చౌకీదార్‌ దొంగ(చోర్‌ హై)’ అని విమర్శించారు. అప్పుడు మోదీ ‘మై భీ చౌకీదార్‌ (నేను కూడా చౌకీదార్‌నే)’ అనే నినాదాన్ని సృష్టించారు. బీజేపీ నేతలంతా అదే కోణంలో కాంగ్రె్‌సపై విరుచుకుపడ్డారు. ‘మోదీపై విపక్షాల వ్యక్తిగత విమర్శలు ఇంతవరకు పనిచేయకపోగా.. వాటినే దెబ్బతీశాయి. 2014లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌.. చాయ్‌వాలా అంటూ మోదీని ఎద్దేవాచేయడం కాంగ్రె్‌సను ఓటమిపాలు చేసింది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

‘ఇండియా’ ఎదుగుతోందనే

ఎన్నికల వేళ అసలు అంశాల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ ‘మోదీ కా పరివార్‌’ నినాదాన్ని అందుకుందని కాంగ్రెస్‌ ఆరోపించింది. విపక్ష ఇండియా కూటమి ప్రజాదరణ పొందుతుండడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. ‘మోదీ కుటుంబంలో మణిపూర్‌ మహిళలకు చోటు ఉంటుందా? ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను మోదీ తన కుటుంబమేనని చెబుతారా? ఆత్మహత్యలకు పాల్పడుతున్న నిరుద్యోగులను మోదీ తన కుటంబమని ఎందుకు చెప్పుకోరు’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రశ్నించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ కూడా తన బయోకు ‘మోదీ కా పరివార్‌’ను యాడ్‌ చేశారు..

Updated Date - Mar 05 , 2024 | 03:53 AM