Prajwal Revanna: ప్రజ్వల్ ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - May 29 , 2024 | 08:24 PM
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టులో ప్రజ్వల్ పేరుతో ఆయన తరఫు న్యాయవాది అరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
బెంగళూరు: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ముందస్తు బెయిల్ (anticipatory bail) పిటిషన్‌ను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ప్రజ్వల్ పేరుతో ఆయన తరఫు న్యాయవాది అరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. లైంగిక ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26న విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ మే 31న స్వదేశానికి తిరిగి రానున్నారు. బెంగళూరు విమానాశ్రయానికి ఆయన రాగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర ఇప్పటికే తెలుపగా, ఆయనను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు.
Karnataka MP: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌తో తొలుత జర్మనీకి పారిపోయారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన సిట్ ప్రజ్వల్‌కు నోటీసు పంపగా, ఆయన గడువు కోరడం, అందుకు నిరాకరించిన విచారణ సంస్థ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయడం వంటి వరుస పరిణామాలు చోటుచేసుకున్నారు. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీకావడంతో ఎట్టకేలకు ప్రజ్వల్ గత సోమవారంనాడు ఒక వీడియో రిలీజ్ చేశారు. మే 31వ తేదీ ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం మునిచ్ నుంచి మే 30న ప్రజ్వల్ విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అదేరోజు అర్ధరాత్రి కల్లా ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ కాగానే అరెస్టు చేసేందుకు కెంపేగౌడ విమానాశ్రయంలో సిట్ నిఘా పెట్టింది.