Priyanka Gandhi: మీలో ఒకరిగా ఉంటా!
ABN , Publish Date - Oct 24 , 2024 | 04:28 AM
తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.
35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 17 ఏళ్ల వయస్సులోనే నా తండ్రి కోసం ప్రచారం చేశా
మీరు నా సోదరుడికి అండగా నిలిచారు
నాకు అవకాశం కల్పిస్తే.. అది నాకు ఎంతో గౌరవం
వయనాడ్ ప్రజలకు ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి
భారీ రోడ్డు షోతో నామినేషన్.. పాల్గొన్న సోనియాగాంధీ, రాహుల్, సీఎం రేవంత్, భట్టి
వయనాడ్‌లో నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీ
వయనాడ్, అక్టోబరు 23: తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో దిగిన ఆమె బుధవారం భారీ రోడ్డుషో నిర్వహించి నామినేషన్ వేశారు. తద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా తనకు ఘన స్వాగతం పలికేందుకు హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అఽధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర పార్టీ సీనియర్ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.
ప్రియాంక తన ప్రసంగంలో రాజకీయాల్లో తనకు 35 ఏళ్ల అనుభవం ఉందని పేర్కొన్నారు. 17 ఏళ్ల వయస్సులోనే తన తండ్రి దివంగత రాజీవ్‌గాంధీ కోసం 1989లో ప్రచారం చేశానని చెప్పారు. బీజేపీ నుంచి వయనాడ్ ఉప ఎన్నికల బరిలో దిగిన నవ్య హరిదాస్.. ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలో ప్రియాంకకన్నా తనకు ఎంతో అనుభవం ఉందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడినప్పుడు తాను ఇక్కడికి వచ్చానని, అప్పుడు తాను కలుసుకున్న వారందరూ బాధితులకు సాయం చేసినవారేనని ప్రియాంక తన ప్రసంగంలో తెలిపారు. వారి ధైర్యం తనను కదిలించిందన్నారు. మీలో ఒకరిగా, మీ కుటుంబసభ్యురాలిగా ఉండడం తనకు గౌరవం, అదృష్టం అవుతుందన్నారు.
ప్రపంచమంతా తన సోదరుడు రాహుల్‌కి వెన్ను చూపినప్పుడు వయనాడ్ ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. ‘‘మీ సమస్యలపై పోరాడతాను, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను’’ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ పాలనను వివరిస్తూ... తమను ఎన్నుకొన్న ప్రజలనే అధికారంలో ఉన్నవారు విభజించే పరిస్థితి నెలకొందన్నారు. వారు ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి వెనుకాడరని ఆమె విమర్శించారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. తనను ఆదరించినట్లే తన సోదరిని కూడా ఆదరించాలని వయనాడ్ ప్రజలను కోరారు. రాహుల్ వయనాడ్‌తోపాటు యూపీలోని రాయబరేలి నుంచి లోక్‌సభకు ఎన్నికయి.. వయనాడ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో ఇక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది.
బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ప్రియాంక వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట రాహుల్, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉన్నారు. అనంతరం రాహుల్, ప్రియాంక వయనాడ్‌లో కొండచరియలు పడి ప్రాణాలు కోల్పోయిన వారిని ఖననం చేసిన పుతుమల సామూహిక శ్మశానవాటికకు చేరుకుని నివాళులు అర్పించారు. కాగా తనకు రూ. 12 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రియాంక తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.