Share News

High Court of Gujarat : కళ్లు మూసుకుపోయాయా?

ABN , Publish Date - May 28 , 2024 | 06:10 AM

పలువురు చిన్నారులతోపాటు మొత్తం 27 మందిని బలిగొన్న టీఆర్‌పీ గేమ్‌జోన్‌ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి రాజ్‌కోట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌పై గుజరాత్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటి

High Court of Gujarat  : కళ్లు మూసుకుపోయాయా?

గేమ్‌జోన్‌ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా చూడలేదా?

దానికి అనుమతులు ఉన్నాయా?

ప్రాణాలు పోతేగానీ రంగంలోకి దిగరా?

రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది

రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌ దారుణంపై గుజరాత్‌ హైకోర్టు మండిపాటు

అహ్మదాబాద్‌, మే 27: పలువురు చిన్నారులతోపాటు మొత్తం 27 మందిని బలిగొన్న టీఆర్‌పీ గేమ్‌జోన్‌ అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి రాజ్‌కోట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌పై గుజరాత్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021లో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ ఏర్పాటైనప్పటి నుంచీ ఇప్పటి వరకు కార్పొరేషన్‌ కమిషనర్లుగా పని చేసిన అధికారులందరూ ఈ దారుణానికి బాధ్యులేనని పేర్కొంది. వారందరూ గేమ్‌జోన్‌కు ఉన్న అనుమతులు, ఆ నిర్మాణం పటిష్ఠతకు సంబంధించిన వివరాలు వంటి అన్ని అంశాలపై విడివిడిగా అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శనివారం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో జరిగిన దారుణ అగ్ని ప్రమాదంపై హైకోర్టు సోమవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజ్‌కోట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. తగిన అనుమతుల కోసం గేమ్‌జోన్‌ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘మీ పరిధిలో అంత పెద్ద నిర్మాణం వెలిస్తే మీరు కళ్లు మూసుకొని ఉన్నారా? గత మూడున్నరేళ్లుగా అక్కడ గేమ్‌జోన్‌ నడుస్తుంటే ఆ విషయం మీకు తెలియదా? అగ్నిమాపక అనుమతుల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారా? గేమ్‌జోన్‌లోకి వెళ్లే వారికి ఇచ్చే టికెట్లపై వినోదం పన్ను (మునిసిపాలిటీకి చెల్లించే పన్ను) వసూలు చేస్తారు. అదైనా మీకు తెలుసా? తెలియదా?’ అని ప్రశ్నలు కురిపించింది. 2021లో గేమ్‌జోన్‌ ప్రారంభోత్సవం కార్యక్రమానికి అప్పటి మునిసిపల్‌ కమిషనర్‌ వెళ్లినట్లుగా మీడియా వార్తల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. నాలుగేళ్ల క్రితం ఓ ప్రజాప్రయోజనవ్యాజ్యంలో అగ్నిప్రమాదాల నివారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేస్తూ.. వాటికి అనుగుణంగా ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీసింది. విచారణ సందర్భంగా మరో న్యాయవాది.. జరిగిన ఘటనకు బాధ్యులెవరో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఎవరు కఠిన చర్యలు చేపడతారు? నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం పోయింది. నాలుగేళ్ల క్రితం మేం ఆదేశాలు జారీ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలుకు మాకు హామీ ఇచ్చింది. కానీ, తాజా ఘటనతో కలిపి ఇప్పటి వరకూ ఆరు అగ్నిప్రమాదాలు సంభవించాయి. ప్రాణాలు పోయిన తర్వాతే అధికారులు రంగంలోకి దిగుతున్నారు. దీనిని బట్టి ప్రాణాలు పోవాలనే వారు కోరుకుంటున్నట్లున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవన్‌ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలు పాటించకుండా, విధులను నిర్లక్ష్యం చేసిన అధికారులపై సస్పెన్షన్‌ విధించేలా ఆదేశాలు జారీ చేయాలని తమకు ఉన్నప్పటికీ.. వారికి ఒక అవకాశం ఇద్దామని వదిలేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. 2021 నుంచి ఇప్పటి వరకూ రాజ్‌కోట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లుగా పని చేసిన వారందరితోపాటు అహ్మదాబాద్‌, వడోదర, సూరత్‌, రాజ్‌కోట్‌ అగ్నిమాపక విభాగాల ముఖ్య అధికారులు కూడా విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


పోలీసు, మునిసిపల్‌ కమిషనర్ల బదిలీ

రాజ్‌కోట్‌ పోలీసు కమిషనర్‌ సహా ఆరుగురు ఐపీఎస్‌ అధికార్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. పోలీసు కమిషనర్‌ రాజు భార్గవను బదిలీ చేసి ఆయన స్థానంలో బ్రజేష్‌ కుమార్‌ ఝాను నియమించింది. అదనపు కమిషనర్‌ విధి చౌధురి, డీసీపీ సుధీర్‌ కుమార్‌ జె దేశాయ్‌ సహా మరికొందరు ఐపీఎ్‌సలను బదిలీ చేసింది. మన్సిపల్‌ కమిషనర్‌ ఆనంద్‌ పటేల్‌ను కూడా స్థాన చలనం చేసి ఆయన స్థానంలో అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ సీఈఓగా ఉన్న డి.పి.దేశాయ్‌ను నియమించింది. మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌, పోలీసు విభాగాలకు చెందిన ఏడుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. ఇదిలా ఉండగా, ప్రమాదంలో మరణించిన వారి దేహాలను డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇంతవరకు 9 మందిని గుర్తించినట్టు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హార్ష్‌ సంఘవి చెప్పారు.

వెల్డింగ్‌ వల్లే ప్రమాదం!

రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి ఆ సమయంలో అక్కడ జరుగుతున్న వెల్డింగ్‌ పనులే కారణమని అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ద్వారా తెలుస్తోంది. గేమింగ్‌ జోన్‌ మొదటి ఫ్లోర్‌ పైకప్పునకు వెల్డింగ్‌ పనులు చేస్తుండగా.. ఆ నిప్పు రవ్వలు కింద ఉన్న పెట్రోల్‌ డబ్బాలు లేదా ప్లాస్టిక్‌ లాంటి వస్తువులపై పడి మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ వారికి సాధ్యం కాలేదు. మంటలు వేగంగా వ్యాపించాయి. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. తాజాగా ఆ వీడియో బయటకు వచ్చింది. రాజ్‌కోట్‌లో ఈ నెల 25న అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27మంది చనిపోయారు. అందులో 9 మంది పిల్లలు ఉన్నారు.

Updated Date - May 28 , 2024 | 06:10 AM