Share News

Ayodhya: జనవరి 22 సెలవు దినం కొందరికేనా.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయా..?

ABN , Publish Date - Jan 19 , 2024 | 04:23 PM

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.

Ayodhya: జనవరి 22 సెలవు దినం కొందరికేనా.. ఆ రోజు బ్యాంకులు పని చేస్తాయా..?

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు జనవరి 22న సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఉద్యోగులకు హాఫ్ డే హాలీడే ప్రకటించింది. దేశంలోని అన్ని కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు 22 జనవరి 2024న మధ్యాహ్నం 2.30 నిమిషాల తర్వాతే విధులు నిర్వహిస్తాయి. ఈ ఆదేశాలను అన్ని శాఖలు పాటించాల్సిందేనని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే.. ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గోవా ప్రభుత్వం సెలవు ప్రకటించి వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జనవరి 22న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన స్మారకార్థం జనవరి 22ను సెలవు దినంగా మార్చినట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.


మధ్యాహ్నం తర్వాతే..

ఛత్తీస్‌గఢ్ లో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకల్లో ఉద్యోగులు సైతం పాల్గొనేందుకు వీలుగా త్రిపుర రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించింది. ఒడిశాలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రెవెన్యూ, మెజిస్టియల్ కోర్టులు మధ్యాహ్నం 2:30 గంటల వరకు విధులు నిర్వహించవు. గుజరాత్, అసోం ప్రభుత్వాలు సైతం హాఫ్ హాలీడే లీవ్ ప్రకటించాయి.

సాంప్రదాయబద్ధంగా..

రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి విరాళాలు ఇవ్వాలనుకునేవారు యూపీఐ లేదా ఆన్‌లైన్ ద్వారా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక బ్యాంక్ ఖాతాకు పంపించవచ్చని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. సనాతన సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా అభిజిత్ ముహూర్తంలో ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవం జరగనుంది. జనవరి 16 న ప్రారంభమైన ఈ వేడుకలు జనవరి 21వరకు కొనసాగి.. 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో ముగుస్తాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 19 , 2024 | 04:23 PM