Rameshwaram Cafe blast: నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:32 PM
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో గత వారం భారీ పేలుడుకు కారణమైన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నగదు బహుమతిని ప్రకటించింది. సమాచారం అందించిన వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తామని తెలిపింది. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
న్యూఢిల్లీ: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కేఫ్ (Ramshwaram Cafe)లో గత వారం భారీ పేలుడుకు కారణమైన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నగదు బహుమతిని ప్రకటించింది. సమాచారం అందించిన వారికి రూ.10 లక్షలు బహుమతి ఇస్తామని తెలిపింది. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
రామేశ్వరం కేఫ్‌లో గత శుక్రవారం మధ్యహ్నం 11.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. తొలుత గ్యాస్ పేలుడు జరిగినట్టు అనుమానించినప్పటికీ, అనుమానిత వ్యక్తి కేఫ్‌లో వదిలి వెళ్లిన ఒక బ్యాగులోని పేలుడు పదార్ధమే (ఆర్‌డీఎక్స్) ఇందుకు కారణంగా నిర్ధారించారు. దీంతో ఎన్ఐఏకు ఈ కేసు దర్యాప్తును అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్‌లో అనుమానితుడు కనిపించడంతో ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నిందితుడు ఒక బస్సులో కేఫ్ దగ్గరకు వచ్చారు. మధ్యాహ్నం 11.30 గంటలకు కేఫ్‌లోకి అడుగుపెట్టి రవ్వ ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి డైనింగ్ ఏరియాలోకి వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చిన ఆహారాన్ని తినకుండానే తనతో తెచ్చిన బ్యాగును డైనింగ్ ప్రాంతంలో వదిలివేసి అక్కడి నుంచి మాయమయ్యాడు.