Share News

భవిష్‌ అగర్వాల్‌ ఘాటు వ్యాఖ్యలు.. ఓలా షేర్లు ఢమాల్‌!

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:22 AM

‘నోరా.. వీపునకు తేకే’ అని సామెత! నోరు దురుసుగా మాట్లాడితే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం!! ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పరిస్థితి సరిగ్గా అదేఅయ్యింది!

భవిష్‌ అగర్వాల్‌ ఘాటు వ్యాఖ్యలు.. ఓలా షేర్లు ఢమాల్‌!

  • కంపెనీ ఈవీల సర్వీసింగ్‌ బాగాలేదని స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా ట్వీట్‌

  • అది ‘పెయిడ్‌’ అంటూ భవిష్‌ ఆగ్రహం

  • ‘ఎక్స్‌’ వేదికగా ఇద్దరి ట్వీట్ల యుద్ధం

  • భవిష్‌పై మండిపడ్డ ఓలా వినియోగదార్లు

  • 8% పతనమైన ఓలా ఎలక్ట్రిక్‌ షేర్ల విలువ

ముంబై, అక్టోబరు 7: ‘నోరా.. వీపునకు తేకే’ అని సామెత! నోరు దురుసుగా మాట్లాడితే వీపు దెబ్బలు తినాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం!! ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పరిస్థితి సరిగ్గా అదేఅయ్యింది! ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) సర్వీసింగ్‌ బాగోలేదంటూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా పెట్టిన ట్వీట్‌కి.. భవిష్‌ కొంచెం ఘాటుగా స్పందించడంతో.. ఓలా ఈవీలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నవినియోగదారులకు కోపం వచ్చింది. తాము ఎదుర్కొంటున్న సర్వీసింగ్‌ సమస్యల గురించి వారంతా ట్వీట్‌ చేయడం మొదలుపెట్టడంతో.. ఓలా షేర్‌ విలువ సోమవారం 8% మేర పతనమైపోయింది!! ‘ఎక్స్‌’ వేదికగా వారిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్ధం ఆదివారం మొదలైంది. తొలుత కునాల్‌ కమ్రా.. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఓలా సర్వీసింగ్‌ సెంటర్‌ బయట పెద్ద సంఖ్యలో, దుమ్ముకొట్టుకుపోయి ఉన్న ఓలా ఈవీల ఫొటో పెట్టి ఒక ట్వీట్‌ చేశారు.


పరిస్థితి ఇలా ఉంటే భారతీయులు ఈవీలకు ఎలా అలవాటు పడతారంటూ.. ఈవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ట్యాగ్‌ చేశారు. ఓలా ఈవీలకు సరైన సర్వీసింగ్‌ లేక ఇబ్బందిపడుతున్న చాలా మంది వినియోగదారులు కునాల్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే, ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌ మాత్రం కునాల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ విషయంలో కునాల్‌కు అంత ఆందోళన ఉంటే.. వచ్చి తమకు సాయం చేయాలని.. ఈ పెయిడ్‌ ట్వీట్‌ చేసినందుకు కునాల్‌కు వచ్చినదానికంటే ఎక్కువే చెల్లిస్తానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

దీనికి కునాల్‌.. తాను పెయిడ్‌ ట్వీట్‌ చేశాననడానికి ఆధారాలుంటే చూపాలని సవాల్‌ చేశారు. దీనికి ప్రతిగా.. ‘‘బాధగా ఉందా? నొప్పి పుడుతోందా? సర్వీస్‌ సెంటర్‌కు రా. చాలా పని ఉంది. నీ ఫ్లాప్‌ ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బు కంటే ఎక్కువ డబ్బు నేను చెల్లిస్తా’’ అంటూ భవిష్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి కమ్రా.. ‘‘గడిచిన నాలుగు నెలల్లో మీ ఓలా ఈవీ కొన్నవారిలో ఎవరైనా తమ బైక్‌ను తిరిగిచ్చేస్తామంటే..వారికి రిఫండ్‌ ఇవ్వండి’’ అని ట్వీట్‌ చేశారు. కాగా.. ఈ ట్వీట్ల యుద్ధానికి ముందే..వరుసగా రెండు రోజులుగా పడిపోతూ వస్తున్న ఓలా షేర్ల విలువ సోమవారం మరింత పతనమై 8% మేర పడిపోయింది.

Updated Date - Oct 08 , 2024 | 04:22 AM