Share News

CV Ananda Bose : బెంగాల్లో అనిశ్చితి

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:05 AM

పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ అన్నారు. ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థులు మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని తెలిపారు. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో యువ వైద్యురాలిపై హత్యాచారం..

CV Ananda Bose : బెంగాల్లో అనిశ్చితి

మమత ప్రభుత్వంపై విద్యార్థులకు విశ్వాసం పోయింది

‘అపరిచితుడి’లా సీఎం తీరు: గవర్నర్‌ ఆనంద బోస్‌

కోల్‌కతా, ఆగస్టు 20: పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోందని ఆ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ అన్నారు. ప్రజలు.. ముఖ్యంగా విద్యార్థులు మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని తెలిపారు. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో యువ వైద్యురాలిపై హత్యాచారం.. సమాజానికే సిగ్గుచేటైన ఘటనగా పేర్కొన్నారు. ప్రజలను సంరక్షించాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయలేదని.. పైగా చనిపోయిన వైద్యురాలికి న్యాయం చేయాలంటూ సీఎం మమత స్వయంగా నిరసనకు దిగడాన్ని తప్పుబట్టారు. ఆమెవన్నీ పైపై ప్రకటనలేనని వ్యాఖ్యానించారు. పీటీఐ వార్తాసంస్థకు ఆయన తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘బెంగాల్లో యువత భయాందోళనల్లో ఉన్నారు. మహిళలు తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉన్నారు. పౌరులను సంరక్షించాల్సిన రాష్ట్రప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడం లేదన్న భావన సర్వత్రా ఏర్పడింది. కోల్‌కతా పోలీసు వ్యవస్థ నేరపూరితం, రాజకీయమయం అయిపోయింది. సీఎం మమత ఓ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా క్యాంప్‌సలలో భద్రత లేదని ఆరోగ్య మంత్రి.. హోం మంత్రికి ఫిర్యాదు చేశారట! చర్యలు తీసుకోలేదని హోం మంత్రి సీఎంకు కంప్లయింట్‌ ఇచ్చారట! ప్రజలను పిచ్చివారిని చేయలేరు. రాష్ట్రంలో ఆరోగ్య మంత్రి, హోం మంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురూ మమతే కదా’ అని ఎద్దేవాచేశారు. ఆమె తీరు ‘అపరిచితుడి’లా ఉందన్నారు. చర్యలు తీసుకోవలసిన ముఖ్యమంత్రే.. న్యాయం కోసమంటూ రోడ్లపై ప్రదర్శన చేపట్టడం హాస్యాస్పదమన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 05:05 AM