Share News

Kolkata : హోరెత్తిన వైద్యుల నిరసన

ABN , Publish Date - Aug 18 , 2024 | 05:41 AM

కోల్‌కతా ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

Kolkata : హోరెత్తిన వైద్యుల నిరసన

  • కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఆందోళన

  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఔట్‌పేషెంట్‌ సేవలు బంద్‌

  • హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద ఐఎంఏ ఆధ్వర్యంలో ఆందోళన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కోల్‌కతా ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) పిలుపు మేరకు హైదరాబాద్‌ లోని కార్పొరేట్‌, పెద్దాసుపత్రులతో పాటు ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఔట్‌ పేషెంట్‌ సేవలను నిలిపివేశారు.

అత్యవసర సేవలను మాత్రం అందించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది రోడ్లపైకి వచ్చి నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు నిర్వహించారు. వీరికి, పారా మెడికల్‌ సిబ్బంది, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, మెడికల్‌ రిప్రజంటేటివ్‌లు మద్దతు ప్రకటించారు. హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఐఎంఏ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద వైద్యుల నిరసనలో నగరంలోని అన్ని ఆస్పత్రులకు చెందిన వందలమంది వైద్యులు, జూనియర్‌ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. మల్కాజ్‌గిరి, వరంగల్‌ ఎంపీలు ఈటల రాజేందర్‌, డాక్టర్‌ కడియం కావ్య మద్దతు ప్రకటించారు. ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ పి.కాళీప్రసాదరావు ఆధ్వర్యం వహించారు.


తెలంగాణ ప్రభుత్వ బోధనాస్పత్రుల వైద్యుల, ప్రభుత్వ వైద్యుల, ప్రజారోగ్య వైద్యుల సంఘాలు, నర్సింగ్‌ ఆఫీసర్స్‌, నిమ్స్‌ ఫ్యాకల్టీ, ఇండియన్‌ డెంటల్‌, హెల్త్‌ కేర్‌ రిఫార్మ్‌ డాక్టర్స్‌ అసోసియేషన్స్‌తో పాటు పలు మహిళా సంఘాలు సంఘీభావం తెలిపాయి. హైదరాబాద్‌లో కిమ్స్‌ ఆస్పత్రుల వైద్యులు చైర్మన్‌ డాక్టర్‌ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు.

నానక్‌రామ్‌గూడ, బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆస్పత్రుల వైద్యులు ఎండీ డాక్టర్‌ గోపీచంద్‌ మన్నెం సారథ్యంలో ఆందోళనల్లో పాల్గొన్నారు. యశోద, మెడికవర్‌, ఏఐజీ, రెయిన్‌బో, మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాల్టీ, బసవతారకం ఆస్పత్రుల సిబ్బంది ర్యాలీలు తీశారు. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో కోరారు. వైద్య కళాశాలల్లో పనిచేసే మహిళా సిబ్బంది, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. నేషనల్‌ మెడికోస్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ శంకర్‌, సురేంద్ర ట్యాంక్‌బండ్‌పై వివేకానంద విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు.


  • మానవ హారాలు.. కొవ్వొత్తుల ర్యాలీలు

నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యుల సంఘం నాలుగో రోజూ ఆందోళన కొనసాగించింది. భారత దేశ చిత్రపటంలో వైద్యురాలి చిత్రాన్ని వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్‌, పాలమూరు, వనపర్తిలో మానవహారాలు నిర్మించారు. కరీంనగర్‌లో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో ర్యాలీలు తీశారు. ఖమ్మంలో పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి సర్దార్‌ పటేల్‌ ేస్టడియం వరకు అంబులెన్స్‌లతో సహా భారీ ర్యాలీ తీశారు.

నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లో ర్యాలీలు నిర్వహించారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి విద్యార్థులు నిరసన చేపట్టారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేటలో ఆందోళనలు జరిగాయి. కాగా, మహిళా డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణ శిక్ష విధించాలని మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Aug 18 , 2024 | 05:45 AM