Delhi Ganesh: ప్రముఖ నటుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
ABN , Publish Date - Nov 10 , 2024 | 07:11 AM
పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి అందరినీ మెప్పించిన.. దేశవ్యాప్తంగా అనేక భాషల్లో నటించిన ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూశారు.
చెన్నై: పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి అందరినీ మెప్పించిన సీనియర్ నటుడు... దేశవ్యాప్తంగా అనేక భాషల్లో నటించిన ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ (Delhi Ganesh Passed Away) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు అని, కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఢిల్లీ గణేశ్ మరణ వార్తతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సినీ సెలబ్రిటీలు తమ సంతాపాలను తెలియజేస్తున్నారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం..
ఆగష్టు 1, 1944న గణేశ్ జన్మించారు. ‘ఢిల్లీ గణేశ్’గా ఆయనకు గుర్తింపు వచ్చింది. 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళంలో దశాబ్ద కాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సాయుధ దళాల నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీ కేంద్రంగా ప్రదర్శనలు చేసే ‘దక్షిణ భారత నాటక సభ’ బృందంలో చేరారు. దిగ్గజ దర్శకుడు కే బాలచందర్.. గణేశ్‌కు ‘ఢిల్లీ గణేశ్’ అని రంగస్థలం పేరు పెట్టి తమిళ సినిమాకు పరిచయం చేశారు. గణేశ్ 1976లో సినీ రంగ ప్రవేశం చేశారు.
ఆ తర్వాత ఎప్పుడు వెనుదిరిగి చూసుకోలేదు. కామెడీ నుంచి ప్రతినాయక పాత్రల వరకు ఎన్నో పాత్రల్లో అలరించారు. ఎన్నో పాత్రల్లో కడుపుబ్బా నవ్వించారు. ఆయన నటించిన ఎన్నో పాత్రలకు చక్కటి గుర్తింపు వచ్చింది. 1979లో విడుదలైన ‘పసి’ అనే సినిమాలో ఆయన నటనకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి దక్కింది. కెరీర్‌లో ఆయన 400లకు పైగా సినిమాల్లో నటించారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో అల్లరించారు.
విశేష గుర్తింపు తెచ్చిన పాత్రలు ఇవే..
సింధు భైరవి (1985), నాయకన్ (1987), మైఖేల్ మదన కామ రాజన్ (1990), ఆహా..! (1997), తెనాలి (2000) సినిమాల్లో పాత్రలకు ఆయన చక్కటి గుర్తింపు దక్కింది. అపూర్వ సగోధరార్గళ్ (1989)లో ఆయన విలన్ పాత్రకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయనలో ఉన్న టాలెంట్, సంక్లిష్టమైన పాత్రలను సైతం అలవోకగా మెప్పించగలరని పేరు తెచ్చుకున్నారు. ‘ఎంగమ్మ మహారాణి’లో (1981) హీరోగా కూడా నటించారు.
మరో విశేషం ఏంటంటే.. పలు టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా ఆయన నటించారు. 2015లో చిత్ర నిర్మాణంలో కూడా అడుగుపెట్టారు. గణేష్ కొడుకు మహా ప్రధాన పాత్రలో నటించిన ఎన్నుల్ ఆయిరం (2016) సినిమాను ఆయనే నిర్మించారు.