Fire Incident: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో.. నోట్ల కట్టలు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 05:28 AM
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆ ఇంట్లో కట్టలకొద్దీ నగదు కనిపించినట్టు వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు
హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం.. ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది
అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు
ఈ నెల 14న ఘటన జరిగితే.. 21న వెలుగులోకి
రూ.15-50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు
ప్రభుత్వ వర్గాల ద్వారా సీజేఐకి ఈ సమాచారం
ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం
జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన!
అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం
తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్టా? అని ఆగ్రహం
డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ఓ ప్రకటనలో సుప్రీం వెల్లడి
విచారణకు, బదిలీకి సంబంధం లేదన్న సుప్రీం
జడ్జి ఇంట్లో డబ్బే దొరకలే: ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ
న్యూఢిల్లీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆ ఇంట్లో కట్టలకొద్దీ నగదు కనిపించినట్టు వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 14 (హోలీ రోజు) రాత్రి 11.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగ్గా.. డబ్బు కట్టలు బయటపడ్డ విషయం 21వ తేదీ దాకా బయటకు రాకపోవడం మిస్టరీగా మారింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో న్యాయమూర్తి ఊళ్లో లేరని సమాచారం. ఆయన కుటుంబసభ్యులు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి లోపలకు వెళ్లగా ఒక గదిలో కట్టల కట్టల నగదు కనిపించిందని.. ఆ డబ్బు రూ.15 కోట్ల దాకా ఉంటుందని కొన్ని వర్గాలు తెలపగా.. దొరికిన డబ్బు రూ.50 కోట్ల దాకా ఉంటుందని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ రోజు ఎంత డబ్బు బయటపడిందన్న విషయంపై అధికారిక సమాచారమేదీ లేదు. కాగా.. జడ్జి ఇంట్లో భారీ ఎత్తున నగదు బయటపడిన విషయాన్ని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారని.. వారి ద్వారా ఈ విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు తెలిసిందని సమాచారం. ఆయన దీన్ని తీవ్రంగా పరిగణించి కొలీజియం సమావేశం నిర్వహించగా.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ఏకగ్రీవంగా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే.. జరిగిన ఘటన తీవ్రత నేపథ్యంలో కేవలం జడ్జి బదిలీతో సరిపెడితే అది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను, ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి జస్టిస్ వర్మ రాజీనామా కోరాలని కొలీజియంలోని కొందరు సభ్యులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఒకవేళ ఆయన అందుకు నిరాకరిస్తే సీజేఐ ఆయనపై అంతర్గత విచారణ చేపట్టాలని కూడా సూచించినట్టు సమాచారం. కాగా.. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఏదో కొరవడుతోందని, అది అవినీతికి దారితీసి.. అంతిమంగా ప్రజలకు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వెలిబుచ్చింది. ‘‘అలహాబాద్ హైకోర్టు ఏమీ చెత్త బుట్టా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తప్పుడు సమాచారం..
అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్‌తోపాటు.. దేశవ్యాప్తంగా న్యాయవర్గాలు, ప్రజల నుంచి దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటివద్ద జరిగిన ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారం, వదంతులు వ్యాపిస్తున్నాయి’’ అని అందులో పేర్కొంది. ఈ వ్యవహారంపై మార్చి 20న సుప్రీం కోలీజియం సమావేశం కావడానికి ముందే.. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ ప్రారంభించి, వివరాలు సేకరిస్తున్నారని వెల్లడించింది. ఆయన్నుంచి నివేదిక అందగానే దాన్ని పరిశీలించి తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘‘ఢిల్లీ హైకోర్టులో రెండో సీనియర్ మోస్ట్ జడ్జి, కొలీజియం సభ్యుడు అయిన జస్టిస్ యశ్వంత్‌వర్మను.. ఆయన పేరెంట్ కోర్టు అయిన ‘హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ అలహాబాద్’కు బదిలీ చేయాలన్న ప్రతిపాదన, ఢిల్లీ హైకోర్టులో ఆయనపై జరుగుతున్న అంతర్గత విచారణ.. ఈ రెండూ వేర్వేరు అంశాలు. ఆయన్ను బదిలీ చేయాలన్న ప్రతిపాదనను సుప్రీం సీజే, నలుగురు సీనియర్ మోస్ట్ సుప్రీం జడ్జీలతో కూడిన కొలీజియం మార్చి 20న పరిశీలించింది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులోని కన్సల్టీ జడ్జీలకు, సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాసింది. వారి నుంచి వచ్చిన ప్రతిస్పందనలను పరిశీలించి, కొలీజియం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆ ప్రకటనలో సుప్రీంకోర్టు పేర్కొంది.
తీవ్రమైన విషయం..
జస్టిస్ వర్మ ఇంట్లో డబ్బు కట్టల వ్యవహారంపై పలువురు ప్రముఖ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రమైన విషయమని.. ఆయన్ను వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కోరాలని సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యవహారాల్లో బదిలీ పరిష్కారం కాదని ఆయన తేల్చిచెప్పారు. ఇక.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, నిజాలను రాబట్టాలని మరో సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన వాస్తవాలను పూర్తిగా, స్వేచ్ఛగా, సూటిగా బయటపెట్టాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కోలీజియంపై ఉందని సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్ అన్నారు. ఎప్పుడో మార్చి 14న ఘటన జరిగితే.. మార్చి 21 దాకా ఆ విషయం బయటపడకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో..
జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేశ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం గురించి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ స్పందన కోరారు. అలాగే.. అలహాబాద్ హైకోర్టు జడ్జికే సంబంధించి పెండింగ్‌లో ఉన్న అభిశంసన నోటీసు గురించి కూడా గుర్తుచేశారు. దీనిపై స్పందించిన జగ్‌దీప్ ధన్‌ఖడ్.. ఈ ఘటన జరిగిన వెంటనే బయటకు రాకపోవడం తనను ఎక్కువగా బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఒక రాజకీయ నాయకుడి విషయంలోనో, అధికారి లేదా పారిశ్రామికవేత్త విషయంలోనో జరిగి ఉంటే వారిని వెంటనే లక్ష్యంగా చేసుకుంటారని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు.. జడ్జి బదిలీతో ఈ వ్యవహారాన్ని ముగించలేరని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ‘‘జస్టిస్ వర్మ.. ఉన్నావ్ రేప్ కేసు సహా పలు తీవ్రమైన కేసులను వింటున్నారు. న్యాయవ్యవస్థపై దేశప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోకుండా చూడాలంటే.. ఆయన ఇంట్లో దొరికిన డబ్బు ఎవరిదో, ఆయనకు ఎందుకు ఇచ్చారో కనిపెట్టాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. మాజీ సీజేఐ ఒకరు న్యాయదేవత కళ్లకున్న గంతలను తీసేస్తూ.. ‘న్యాయం గుడ్డిది కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది’ అని వ్యాఖ్యానించారని.. ఈ కేసులో ఆ విషయం రుజువు కావాలని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. దేశంలో ఈడీ, సీబీఐ కన్నా అగ్నిమాపక సిబ్బందే సమర్థంగా పనిచేస్తున్నారన్నారు.
డబ్బు కట్టలేం దొరకలేదు
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్
జస్టిస్ వర్మ ఇంట్లో కట్టల కొద్దీ డబ్బు దొరికిన వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుండగా.. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ మాత్రం ఆయన ఇంట్లో తమ సిబ్బందికి అసలు డబ్బే దొరకలేదని చెప్పారు. శుక్రవారం ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘మార్చి 14న రాత్రి 11.35 గంటలకు.. జస్టిస్ వర్మ నివాసంలో మంటలు చెలరేగాయని పేర్కొంటూ మా కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిఇంది. 11.43 గంటలకల్లా రెండు అగ్నిమాపక శకటాలను ఆయన ఇంటికి పంపించాం. కాగితాలు, ఇతర వస్తువులు ఉన్న స్టోర్ రూమ్‌లో చెలరేగిన మంటలను మా సిబ్బంది 15 నిమిషాల్లో ఆర్పేశారు. వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం అందించి.. మా సిబ్బంది అక్కణ్నుంచీ వచ్చేశారు. మా ఫైర్‌ఫైటర్లు అక్కడ ఎలాంటి నగదునూ కనుగొనలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.