Wayanad : వయనాడ్లో 365కు పెరిగిన మరణాలు
ABN , Publish Date - Aug 05 , 2024 | 01:57 AM
వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ విషాదంలో మృతుల సంఖ్య 365కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో 30 మంది చిన్నారులున్నారు.
ఇంకా 206 మంది గల్లంతు
వయనాడ్, ఆగస్టు 4: వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డ విషాదంలో మృతుల సంఖ్య 365కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతుల్లో 30 మంది చిన్నారులున్నారు. మరో 206 మంది గల్లంతయ్యారని, వారిని వెతికేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఆరో రోజు సహాయక చర్యల్లోనూ మృతదేహాలు లభ్యమవుతున్నాయే తప్ప.. సజీవంగా ఎవరూ కనిపించడం లేదని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 148 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. గాలింపు చర్యలను సోమవారంతో ముగిస్తామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. 93 పునరావాస కేంద్రాల్లో 10 వేల మంది ఆశ్రయం పొందుతున్నారన్నారు.
కాగా.. కేరళలో వరద, భారీ వర్షాలు ఇంకా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం సూచిపారా ప్రాంతంలో వరదలో చిక్కుకుపోయిన ఐదుగురు వ్యక్తులను కాపాడినట్లు వాయుసేన తెలిపింది. వయనాడ్ విషాదం గురించి పోలీసులు, అగ్నిమాపక శాఖ, విపత్తు నిర్వహణ విభాగాలకు తొలుత సమాచారం అందించిన మహిళ నీతూ జోజో కూడా వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించడం సాధ్యం కాదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్ అన్నారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. కేంద్రం అవసరమైన సాయాన్ని అందజేస్తుందని వీరిద్దరూ చెప్పారు.