Share News

మూడు లోకాలు.. మూడు కాలాలు.. అదీ ‘కల్కి’

ABN , Publish Date - Jun 23 , 2024 | 01:28 AM

గంగ మానవజాతికి జీవాధారం. కలియుగం అంతంలో గంగ ఎండిపోతుంది.. అప్పుడు ఈ భూమిపై ఉన్న అతి పురాతన నగరం- కాశీ ఎలా ఉంటుంది? మన సంస్కృతి కాశీ నుంచే ప్రారంభమయిందనేది ఒక భావన.

మూడు లోకాలు.. మూడు కాలాలు..  అదీ ‘కల్కి’

ప్రతి అంతం మరొక ఆరంభానికి నాంది అవుతుంది.

ఆ ఆరంభానికి అడ్డుపడే శక్తులు ఎప్పుడూ ఉంటాయి.

వాటిని జయించినప్పుడే నవ్య యుగం ప్రారంభమవుతుంది. ‘కల్కి’ సినిమా కథాంశమిదే.

‘గంగ మానవజాతికి జీవాధారం. కలియుగం అంతంలో గంగ ఎండిపోతుంది.. అప్పుడు ఈ భూమిపై ఉన్న అతి పురాతన నగరం- కాశీ ఎలా ఉంటుంది? మన సంస్కృతి కాశీ నుంచే ప్రారంభమయిందనేది ఒక భావన. అలాంటి కాశీ మరో వెయ్యి ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఆర్థిక కార్యకలాపాలు ఎలా జరుగుతాయి? ఆ సమయంలో వాహనాలు ఎలా ఉంటాయి? ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది? వీటిని దృష్టిలో పెట్టుకొని కాశీని ఈ సినిమాలో నిర్మించారు. ఆ కాశీపై ఒక పిరమిడ్‌లా ఉండే భవిష్యత్‌ నగరం- కాంప్లెక్స్‌. మన భూమిపై ఏమి ఉండవో.. అవన్నీ ఈ కాంప్లెక్స్‌లో లభిస్తాయి. కాశీలో గంగ ఎండిపోయి కనిపిస్తుంది. కానీ కాంప్లెక్స్‌లో ఆహ్లాదకరమైన సముద్రం ఉంటుంది. ఒక విధంగా చూస్తే- ఇది ఒక స్వర్గం. ఈ భూమిపై ఉండే త్రిశంకు స్వర్గం. ఈ రెండూ కాకుండా - మరో ప్రపంచం కూడా ‘కల్కి’లో కనిపిస్తుంది. దీని పేరు శాంబాలా. దీనిలో నివసించే వారు మనకు భిన్నమైన వారు. వీరికి దేవుడు ఉండడు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే- దేవుణ్ణి ఆ లోకం నుంచి బహిష్కరిస్తారు. కాంప్లెక్స్‌లో నివసించేవారికి, శాంబాలాలో వారికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది. కల్కి శాంబాలాలో జన్మిస్తాడని అందరూ నమ్ముతూ ఉంటారు.


అశ్వత్థామ: మహాభారతంలోని ప్రధానమైన పాత్రల్లో ఆశ్వత్థామ ఒకరు. ‘కల్కి’ సినిమాలో ఈ పాత్ర ను అమితాబ్‌ పోషించారు. భారతంలో అశ్వత్థామ చిరంజీవి... మహావీరుడు. అతడికి మరణం ఉండదు. దుర్యోధనుడికి మిత్రుడు. కౌరవుల తరపున పోరాడాడు. ఇప్పటి దాకా విడుదలయిన రెండు ట్రైలర్స్‌ ఆధారంగా చూస్తే- ‘కల్కి’ని పెంచటంలోను, అతణ్ణి ఒక ప్రతిభావంతుడైన యోధుడిగా తీర్చిదిద్దటంలోను అమితాబ్‌దే ప్రధాన పాత్ర అనిపిస్తుంది. అయితే అందరూ అభిమానించే పురాణపాత్రలు ఈ చిత్రంలో కనిపించవు’’ అంటారు నాగ్‌ అశ్విన్‌. ‘అపరిమితయిన శక్తితో పుట్టిన ఒక వ్యక్తికి తన అధికారాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. ఆ సమయంలో అతనికి ఒక గురువు దొరుకుతాడు..ఈ చిత్రంలో ఇదొక ముఖ్యమైన అంశం...’’ అంటారాయన.


కలి: ఒక నాయకుడి శక్తి అతను పోరాడే ప్రతినాయకుడి శక్తి కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడే అతను నాయకుడు అవుతాడు. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ ప్రతినాయక పాత్ర కూడా ఇలాంటిదే! శంబాలాలోని అతి శక్తిమంతుడైన వ్యక్తి అయిన ‘కలి’గా కమల్‌ ఇప్పటికే ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ తొలిసారి కలిసి కథ చెప్పిన తర్వాత... కమల్‌ ఈ పాత్ర ఎలా ఉంటే బావుంటుందనే విషయంపై చాలా అధ్యయనం చేశారట. ‘‘ఆ పాత్రకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎలాంటి మేకప్‌ ఉంటే బావుంటుంది? అనే విషయంపై నాగీకి కొన్ని రిఫరెన్స్‌లు పంపాను. కానీ వాటిని అప్పటికే అమితాబ్‌కు ఉపయోగిస్తున్నారని ఆ తర్వాత తెలిసింది’’ అంటారు కమల్‌. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర దీపికది. ఈ ప్రపంచాన్ని కాపాడే వీరుడికి జన్మనిచ్చే పాత్ర ఆమెది. ఇక ఈ చిత్రంలో ప్రధానమైన పాత్ర ప్రభాస్‌ది! ఎప్పుడైతే ఈ ప్రపంచం క్రమం తప్పుతుందో., అలాంటి సమయంలో ప్రపంచాన్ని కాపాడటానికి వస్తానని విష్ణువు చెప్పిన మాటల ఆధారంగా పుట్టిన అవతారమే కల్కి. దశావతారాల తర్వాత వచ్చే అవతారం. అయితే ఇప్పటి దాకా బయటకు వెలువడిన ట్రైలర్స్‌, ఇతర పబ్లిసిటీ మెటీరియల్‌ ఆధారంగా చూస్తే- కల్కి తన అందమైన కలలో గుర్రంపైనే వెళ్తుంటాడు. కానీ అతనికి తోడుగా ఉండేది మాత్రం అత్యాధునికమైన ‘బుజ్జి’. ఇంకో రెండు వేల ఏళ్ల తర్వాత ఎలాంటి వాహనాలు ఉండచ్చు? అనే విషయానికి ప్రతీక ఈ బుజ్జి. ఇక హీరో కల్కికి ప్రేమికురాలిగా దిశా పటానీ, మరో ముఖ్యమైన పాత్రలో శోభన కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ చిత్రం గురించి మనకు తెలిసింది అతి తక్కువే! ఇంకా ఈ సినిమాలోని అనేక పాత్రల కోసం మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే!

Updated Date - Jun 23 , 2024 | 07:21 AM