Share News

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:13 AM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రాజీనామా చేసి జంప్ చేయగా.. తాజాగా ఓ బిగ్ షాట్ టీడీపీలో చేరబోతున్నారు..!

YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి బిగ్ షాట్, మరో 9 మంది నేతలు కూడా..!

చిత్తూరు/కుప్పం: కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు తెలిసింది. వైసీపీకి (YSRCP) చెందిన ఛైర్మన్‌, టీడీపీలో (TDP) చేరేందుకే బయలుదేరి వెళ్లినట్లు కుప్పంలో విస్తృతంగా ప్రచారమవుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... మూడేళ్ల క్రితం జరిగిన కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో అధికార యంత్రాంగం వ్యవహరించింది. మొత్తం 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. మున్సిపల్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ సుధీర్‌ ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఛైర్మన్‌ సహా మెజారిటీ వెసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరికకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే వైసీపీనుంచి ఎవరినీ తీసుకోవద్దన్న పాలసీ మేరకు వారి ప్రయత్నాలు సాగలేదు. కానీ వారు ప్రయత్నం చేయడం మాత్రం మానలేదు. మరోవైపు చిత్తూరు కార్పొరేషన్‌లో మేయరు, పలువురు కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరడంతో కౌన్సిల్‌ కూటమి వశమైంది. ఇక, పుంగనూరులో మున్సిపల్‌ చైర్మన్‌ సహా 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీలోనూ చేరికలకు మార్గం ఏర్పడిందని చెబుతున్నారు.


Kuppam-Muncipality.jpg

ఆఖరికి ఇలా..?

ప్రయత్నాలు తుది దశకు చేరినందువల్లే మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ మరో 9 మంది కౌన్సిలర్లతో అమరావతి వెళ్లినట్లు తెలిసింది. అయితే స్థానిక టీడీపీ నేతలు ఎవరికీ వీరి చేరికకు సంబంధించిన సమాచారం లేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి ద్వారా మున్సిపల్‌ ఛైర్మన్‌ సుధీర్‌ ముమ్మర ప్రయత్నాలు చేయడంవల్లే ఒకింత సానుకూల వ్యక్తమయినట్లు తెలిసింది. నేడో రేపో చేరికలు జరిగిపోవడం ఖాయమన్న ప్రచారం కుప్పంలో జోరుగా సాగుతోంది. ఈ విషయం టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంచర్ల శ్రీకాంత్‌కు తెలిసే జరిగిందా లేదా ఆయన పరోక్షంలో జరిగిందా అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఆయనకు తెలిసే జరిగిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్సీకి తెలియకుండా చేరికలు జరిగే అవకాశం ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల్లో కనిపించడంలేదు. దీనిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. మరోవైపు మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కు ఫోన్‌ చేయడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది.

Updated Date - Jul 11 , 2024 | 09:13 AM