Share News

Love Marriage: ప్రేమపెళ్లిలో షాకిచ్చిన మహిళ.. నాన్న కోసం వెళ్లి మాయం!

ABN , Publish Date - Jun 12 , 2024 | 08:10 AM

ఒక మహిళ తాను ప్రేమించిన అబ్బాయి కోసం కుటుంబాన్నే ఎదురించింది. అన్ని వదిలేసి అతనితో వెళ్లిపోయింది. తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకొని, సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ ప్రేమజంటకు..

Love Marriage: ప్రేమపెళ్లిలో షాకిచ్చిన మహిళ.. నాన్న కోసం వెళ్లి మాయం!
Rajasthan Woman Who Left Husband Gone Missing

ఒక మహిళ తాను ప్రేమించిన అబ్బాయి కోసం కుటుంబాన్నే ఎదురించింది. అన్ని వదిలేసి అతనితో వెళ్లిపోయింది. తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకొని, సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ ప్రేమజంటకు ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాతే వీరి లవ్ స్టోరీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన తండ్రి కోసమని చెప్పి తిరిగి సొంతూరుకి వెళ్లిన మహిళ.. మళ్లీ తిరిగి రాలేదు. అట్నుంచి అటే మాయమైపోయింది. మూడు నెలలు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో.. పోలీసులకు న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌లోని జలోధ్‌కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో వాళ్లు పెళ్లి చేసుకోగా.. 2023 నవంబర్‌లో ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. కట్ చేస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భార్యకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఓ సమాచారం అందింది. తండ్రి ఆరోగ్యం బాగోలేదని, తనని చూడాలని కోరుకుంటున్నాడని ఆమెకు సందేశం వచ్చింది. దీంతో.. తండ్రిని చూసేందుకు గాను ఆమె రాజస్థాన్‌కు తిరిగి వెళ్లింది. తన కొడుకుని భర్త వద్దే వదిలేసి వెళ్లిపోయింది.


అలా వెళ్లిన ఆ మహిళ మళ్లీ తిరిగి రాలేదు. ఆమెను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో.. భర్తకు అనుమానం రావడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఫిబ్రవరిలో తండ్రిని చూసేందుకు తన భార్య రాజస్థాన్‌కు వెళ్లిందని, అప్పటినుంచి ఆమె తనతో కాంటాక్ట్‌లోనే లేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. బహుశా.. తన భార్యని ఆమె తండ్రే నిర్బంధించి ఉంటాడని, ఎందుకంటే తమ కులాంతర వివాహాన్ని ఆయన ఎప్పుడూ అంగీకరించలేదని తెలిపాడు. తన భార్యని వెతికి పెట్టాల్సిందిగా.. ఆ పిటిషన్‌లో కోరాడు.

ఈ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు.. మహారాష్ట్ర, రాజస్థాన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం.. మూడు నెలలైనా ఒక మహిళ ఆచూకీని కనిపెట్టలేకపోవడం నమ్మశక్యంగా లేదని మండిపడింది. జలోధ్‌లోని పోలీసుల సహకారంతో ఆ మహిళ జాడ కనిపెట్టి.. జూన్ 20వ తేదీన కోర్టులో హాజరుపరచాలని కొల్హాపూర్ పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. జస్టిస్ భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 08:10 AM