Share News

కెప్టెన్‌తో చెడిందా?

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:16 AM

భారత పేసర్‌ మహ్మద్‌ షమికి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా? షమి జట్టులోకి రావడం హిట్‌మ్యాన్‌కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఓవైపు ఫిట్‌గా లేడని,

కెప్టెన్‌తో  చెడిందా?

అందుకే షమికి బెర్త్‌ దక్కడం లేదా?

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

భారత పేసర్‌ మహ్మద్‌ షమికి.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయా? షమి జట్టులోకి రావడం హిట్‌మ్యాన్‌కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఓవైపు ఫిట్‌గా లేడని, అతడి గాయం తిరగబెట్టిందని రోహిత్‌ మీడియాకు వివరణ ఇస్తుండగా.. మరోవైపు షమి మాత్రం మైదానంలో దుమ్ము రేపుతున్నాడు. ఆదివారం అడిలైడ్‌లో ముగిసిన రెండో టెస్టులో పరాజయం పాలైన తర్వాత రోహిత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...షమి మోకాలు మళ్లీ వాచిందని, గాయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పాడు. గాయం తగ్గకముందే బరిలోకి దింపి షమిని ఒత్తిడిలోకి నెట్టదలచుకోవడం లేదని కూడా రోహిత్‌ వెల్లడించాడు. కానీ సీన్‌ కట్‌ చేస్తే.. సోమవారం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో చండీగఢ్‌పై షమి ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేసిన ఈ పేసర్‌.. అటు బౌలింగ్‌లో 13 డాట్‌ బాల్స్‌ వేసి ఓ వికెట్‌ తీశాడు. మరి.. రోహిత్‌ చెబుతున్నట్టు షమికి గాయం తిరగబెడితే అతను విశ్రాంతి తీసుకోవాలి. కానీ బరిలోకి దిగి ఇంత మెరుగ్గా ఎలా ఆడగలుగుతున్నాడనే చర్చ ఆరంభమైంది. అందుకే ఇద్దరి మధ్య చెడిందనే కథనాలు వినిపిస్తున్నాయి.

అందుకే షమికి బెర్త్‌ దక్కడం లేదా?

అసలేం జరిగిందంటే..

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీ్‌సకు ముందు షమి తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్టు ప్రకటించాడు. అయితే కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం కివీ్‌సతోనే కాకుండా ఆసీస్‌ పర్యటనకు కూడా షమి అందుబాటులో ఉండడని, అతడి గాయం తిరగబెట్టిందని ప్రకటించాడు. అప్పుడే షమి ఈ విషయంలో సోషల్‌ మీడియాలోనూ ఖండించాడు. అలాగే షమి ఎన్‌సీఏ పునరావాస శిబిరంలో ఉన్నప్పుడు బెంగళూరులో కివీస్‌తో తొలి టెస్టు జరిగింది. ఈ సమయంలో రోహిత్‌ను షమి కలిశాడట. తన ఫిట్‌నె్‌సపై తప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నావని షమి గట్టిగానే ప్రశ్నించాడని, అప్పుడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనం సంచలనం సృష్టిస్తోంది.

దేశవాళీల్లో అదరగొడుతున్నా..

మహ్మద్‌ షమి చివరిసారి భారత జట్టు తరఫున 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడాడు. మోకాలి గాయంతో అప్పటి నుంచి ఏడాదిపాటు పునరావాస శిబిరంలో ఉండి కోలుకున్నాడు. జాతీయ జట్టులోకి రావాలంటే షమి ముందుగా దేశవాళీల్లో నిరూపించుకోవాల్సి రావడంతో బెంగాల్‌ తరఫున రంజీ మ్యాచ్‌ ఆడాడు. దీంతో పాటు రెండు వారాల్లోనే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు కూడా ఆడాడు. తద్వారా ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న షమి జాతీయ జట్టులోకి పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపినట్టయింది. కానీ అతడికి ఇప్పటివరకు ఎన్‌సీఏ నుంచి అనుమతి లభించలేదు. అది లభించాకే తను ఆసీస్‌ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్నీ అనుకూలించి తను ఆస్ర్టేలియా వెళ్తే చివరి రెండు టెస్టుల్లో ఆడే వీలుంటుంది.

Updated Date - Dec 10 , 2024 | 01:16 AM