కార్ల్‌సన్ కమాల్
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:24 AM
ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ టాటా స్టీల్ చెస్ టోర్నీలో అదరగొట్టాడు. శుక్రవారంనాడు టోర్నమెంట్ ర్యాపిడ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ నార్వే దిగ్గజం.. తాజాగా బ్లిట్జ్ విభాగంలోనూ విజేతగా నిలిచి....
బ్లిట్జ్ టైటిల్ కూడా మాగ్నస్‌దే
అర్జున్‌కు మూడో స్థానం
టాటా చెస్ మహిళల చాంపియన్ లగ్నో
కోల్‌కతా: ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ టాటా స్టీల్ చెస్ టోర్నీలో అదరగొట్టాడు. శుక్రవారంనాడు టోర్నమెంట్ ర్యాపిడ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ నార్వే దిగ్గజం.. తాజాగా బ్లిట్జ్ విభాగంలోనూ విజేతగా నిలిచి డబుల్ ధమాకా మోగించాడు. 18రౌండ్ల బ్లిట్జ్ విభాగంలో మొదటి తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి కార్ల్‌సన్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి తొమ్మిది రౌండ్లలో..ఒక్క 17వ రౌండ్‌లో మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ కార్ల్‌సన్ జోరు ప్రదర్శించాడు. ఈ రౌండ్‌లో కార్ల్‌సన్‌కు అర్జున్ ఇరిగేసి షాకిచ్చాడు. శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌లోనూ కార్ల్‌సన్‌పై అర్జున్ నెగ్గడం విశేషం. ఇక..18వ రౌండ్‌లో విదిత్ గుజ్‌రాతీపై విజయం సాధించిన మాగ్నస్ మొత్తం 13 పాయింట్లతో టైటిల్ అందుకొన్నాడు. దాంతో ఈ టోర్నమెంట్‌లో రెండోసారి అతడు రెండు టైటిళ్లను దక్కించుకున్నట్టయ్యింది.
2019 లోనూ కార్ల్‌సన్ ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాలలో చాంపియన్‌గా నిలిచాడు. అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో (11.5) రెండో స్థానం కైవసం చేసుకోగా, అర్జున్ (10.5) మూడో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో.. మూడుసార్లు విజేత కాటెరినా లగ్నో (రష్యా) 11.5 పాయింట్లతో టైటిల్ చేజిక్కించుకుంది. తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి (9) నాలుగో, హారిక (8.5) ఐదో స్థానంలో నిలిచారు.