హెచ్‌సీఏలో రూ.90 లక్షల అవినీతి
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:05 AM
ఉప్పల్ స్టేడియం నిర్మాణం, ఆ తర్వాత జరిగిన ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై ఈడీ చేస్తున్న దర్యాప్తులో పురోగతి లభించింది. బుధవారం హెచ్‌సీఏ మాజీ కోశాధికారి...

మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌పై అభియోగాలు
అజర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఉప్పల్ స్టేడియం నిర్మాణం, ఆ తర్వాత జరిగిన ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై ఈడీ చేస్తున్న దర్యాప్తులో పురోగతి లభించింది. బుధవారం హెచ్‌సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌కు సంబంధించిన అవినీతిపై ఈడీ పక్కా ఆధారాలను సేకరించి రూ.90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. మహ్మద్ అజరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో (2019-23) స్టేడియం ఆధునీకరణ పనుల్లో క్విడ్ ప్రోకో కింద అజర్ సహా అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్టేడియం నిర్మాణం, ఆతర్వాత ఆధునీకరణ పనుల కేసులను సమాంతరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులకు సురేందర్ చిక్కారు. 2019-23 మధ్య స్టేడియంలో కొత్త సీట్ల ఏర్పాటు, జిమ్ పరికరాలు, క్రికెట్ బంతుల కొనుగోలులో తక్కువ రకం ఉత్పత్తులను ఎక్కువ మొత్తానికి కొనేలా తమకు లబ్ధి చేకూర్చే కంపెనీలకు కాంట్రాక్టులను ఇచ్చి అవినీతికి తెరలేపారు.
సురేందర్ భార్య, కొడుకు, కోడలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు సారా సోర్ట్స్ సంస్థ నుంచి రూ.17లక్షలు, ఎక్స్‌లెంట్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రూ.21.86 లక్షలు, బాడీ డ్రెంజ్ సంస్థ నుంచి రూ.52 లక్షలు బదిలీ అయినట్టు ఈడీ విచారణలో తేలింది. సురేందర్‌తో పాటు ఈ కేసుల్లో అజరుద్దీన్, కార్యదర్శి విజయానంద్‌పై కూడా ఆరోపణలున్నాయి.