IPL 2024: షాకింగ్ పరిణామం.. ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ ఢమాల్
ABN , Publish Date - Sep 05 , 2024 | 05:13 PM
అయితే చెప్పుకోవడానికి ఇంత గ్రాండ్‌గా అనిపిస్తున్నప్పటికీ గడిచిన సీజన్-2024లో ఐపీఎల్ బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యూ భారీగా పడిపోయింది. ఐపీఎల్ 2023లో సీజన్ ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ 11.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌లో ఏకంగా 9.9 బిలియన్ డాలర్ల స్థాయికి క్షీణించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే ఒక్క మన దేశంలోనే కాదు... ఈ మెగా టోర్నమెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంది. ఎంతోమంది క్రికెట్ అభిమానులు ఈ టోర్నీ కోసం పడి చస్తుంటారు. క్యాష్ రిచ్ లీగ్‌గా పిలిచే ఈ టోర్నీ ప్రపంచంలో అత్యధిక వ్యాల్యూ కలిగి ఉన్న లీగ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. గడిచిన ఈ ఏడాది సీజన్‌లో పరుగుల వరద పారడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. ఒక మ్యాచ్‌లో అయితే 500లకు పైగా పరుగులు నమోదయ్యాయి.
అయితే చెప్పుకోవడానికి ఇంత గ్రాండ్‌గా అనిపిస్తున్నప్పటికీ గడిచిన సీజన్-2024లో ఐపీఎల్ బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యూ భారీగా పడిపోయింది. ఐపీఎల్ 2023లో సీజన్ ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ 11.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌లో ఏకంగా 9.9 బిలియన్ డాలర్ల స్థాయికి క్షీణించింది. ఇటీవలి కాలంలో ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ మేరకు ఏకంగా దాదాపు 11.7 శాతం క్షీణత నమోదయిందని కన్సల్టింగ్, అడ్వైజరీ వాల్యుయేషన్ సేవలు అందించే ‘డీ అండ్ పీ అడ్వైజరీ’ రిపోర్ట్ పేర్కొంది. ఈ మేరకు బుధవారం ‘బియాండ్ 22 యార్డ్స్’ పేరిట 2024 -ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌కు సంబంధించిన వాల్యుయేషన్ వివరాలను వెల్లడించింది.
ఐపీఎల్ 2023 బిజినెస్ వ్యాల్యూ రూ.92,500 కోట్లుగా ఉండగా.. 2024 సీజన్‌లో ఇది రూ.82,700 కోట్లకు పడిపోయింది. టీవీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించినప్పటికీ వ్యాల్యూ మాత్రం తగ్గింది. కాగా ముంబై ఇండియన్స్ 2024లో అత్యంత వ్యాల్యూ కలిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలవగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) రెండవ సీజన్‌లో విశేషా ఆదరాభిమానాలను పొందిందని, క్రికెట్ ప్రేమికుల దృష్టి గణనీయంగా పెంచుకుందని రిపోర్ట్ వివరించింది. డబ్ల్యూపీఎల్‌కు ఆకర్షణ పెరిగిందని వివరించింది. కాగా ఐపీఎల్ 2024కు సమానంగా డబ్ల్యూపీఎల్‌లో కూడా పరుగుల వరద పారింది. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో స్కోరింగ్‌కు సంబంధించి పలు రికార్డులు నమోదయ్యాయి.
మీడియా హక్కుల పున: పరిశీలనతో తగ్గిన వ్యాల్యూ..
ఐపీఎల్ -2024 మీడియా హక్కులను పున: పరిశీలించడమే బిజినెస్ వ్యాల్యూ తగ్గుదలకు కారణమని డీ అండ్ పీ అడ్వైజరీ రిపోర్ట్ పేర్కొంది. ఎక్కువ వ్యాల్యూ పలకవొచ్చని భావించినప్పటికీ అంచనాలను అందుకోలేకపోయిందని వివరించింది. మీడియా- వినోద రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు కారణమయ్యాయని వివరించింది. ఇక డబ్ల్యూపీఎల్2023 వ్యాల్యూ 150 మిలియన్ డాలర్లు ఉండగా.. 2024 సీజన్‌లో అది 160 మిలియన్ డాలర్లకు పెరిగిందని, దాదాపు 8 శాతం మేర పెరుగుదల నమోదయిందని రిపోర్ట్ పేర్కొంది.