Share News

IND vs ENG: అటు బౌలర్లు.. ఇటు జైస్వాల్.. ఇంగ్లండ్‌పై భారత్ తాండవం

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:19 PM

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తడాఖా చూపిస్తోంది. బజ్‌బాల్ అంటూ బిల్డప్పులు ఇచ్చుకుంటూ వచ్చిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు మనోళ్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

IND vs ENG: అటు బౌలర్లు.. ఇటు జైస్వాల్.. ఇంగ్లండ్‌పై భారత్ తాండవం

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన తడాఖా చూపిస్తోంది. బజ్‌బాల్ అంటూ బిల్డప్పులు ఇచ్చుకుంటూ వచ్చిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు మనోళ్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తొలుట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఇంగ్లండ్‌ను.. తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు విజృంభించడంతో.. ప్రత్యర్థి జట్టు పేకమేడలా కుప్పకూలింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) ఒక్కడే అర్థశతకంతో రాణించగా.. బెయిర్‌స్టో (37), బెన్ డకెట్ (35) పర్వాలేదనిపించారు. అంతే.. మిగతా వాళ్లు భారత బౌలర్ల ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలా మూడు.. అక్షర్ పటేల్, బుమ్రా 2 చొప్పున వికెట్లు పడగొట్టారు.


ఇక ఇంగ్లండ్ ఆలౌట్ అయ్యాక బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు.. రావడం రావడంతోనే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇదేదో వన్డే మ్యాచ్ అన్నట్టు.. అటు జైస్వాల్, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయారు. రోహిత్ కాస్త నిదానంగానే రాణిస్తే.. జైస్వాల్ మాత్రం చిచ్చరపిడుగలా చెలరేగిపోయాడు. 47 బంతుల్లోనే అతడు అర్థశతకం మైలురాయిని అందుకున్నాడు. ఈ ఓపెనింగ్ జోడీ కలిసి తొలి వికెట్‌కి 80 పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసేవరకూ ఈ జోడీ ఇలాగే కొనసాగుతుందని అనుకుంటే.. దురదృష్టవశాత్తూ కెప్టెన్ రోహిత్ ఔట్ అయ్యాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఏదేమైనా.. వీళ్లిద్దరు ఇచ్చిన శుభారంభాన్ని చూస్తుంటే, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ ఆధిక్యాన్ని చేజిక్కించుకునేలా కనిపిస్తోంది.

Updated Date - Jan 25 , 2024 | 04:19 PM