Mumbai Test: ముంబై టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్.. భారత లక్ష్యం ఎంతంటే
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:05 AM
నగరంలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో మూడవ రోజు ఆట మొదలైంది.
ముంబై: నగరంలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో మూడవ రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోర్ 171/9 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పర్యాటక జట్టు కివీస్ మరో 3 పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్‌ను కోల్పోయింది. కివీస్ బ్యాటర్ అజాజ్ పటేల్‌ను స్పిన్నర్ రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. దీంతో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత విజయ లక్ష్యం 147 పరుగులుగా ఉంది. భారత్ రెండవ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది.
ఆరంభంలో రెండు వికెట్లు..
4 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు నష్టపోయి 16 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో గ్లేన్ ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ కేవలం 1 పరుగుకే ఔట్ అయ్యాడు. అజాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
అదరగొట్టిన జడేజా
కాగా ఇవాళ దక్కిన వికెట్‌తో కలుపుకొని ఈ మ్యాచ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా మొత్తం 10 వికెట్లు తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5, రెండవ ఇన్నింగ్స్‌లో 5 చొప్పున వికెట్లు తీశాడు. దీంతో ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో అతడు తీసిన వికెట్ల సంఖ్య 51కి పెరిగింది. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఒక డబ్ల్యూసీ సైకిల్‌లో 50కిపైగా వికెట్లు తీసిన రెండవ భారతీయ బౌలర్‌గా జడేజా నిలిచాడు. అశ్విన్ ఇప్పటివరకు మూడు డబ్ల్యూటీసీ సైకిల్‌లలో 50 ప్లస్ వికెట్లు తీశాడు. జడేజా 2021-23 సైకిల్‌లో అత్యధికంగా 47 వికెట్లు తీశాడు. ఆ సంఖ్యను ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో మెరుగుపరచుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్‌లను కూడా అధిగమించాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియా ద్వయం కమిన్స్, స్టార్క్‌లు చెరో 48 వికెట్లు తీశారు.