Share News

India vs Sri Lanka: మోస్తరు స్కోరుకే చాపచుట్టేసిన శ్రీలంక.. భారత్ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Jul 28 , 2024 | 09:47 PM

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేసింది. తొలుత టాపార్డర్ అద్భుతంగా..

India vs Sri Lanka: మోస్తరు స్కోరుకే చాపచుట్టేసిన శ్రీలంక.. భారత్ లక్ష్యం ఎంతంటే?

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులే చేసింది. తొలుత టాపార్డర్ అద్భుతంగా రాణించడం చూసి.. ఆతిథ్య జట్టు తప్పకుండా 200 పరుగుల మైలురాయిని దాటేస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే భారత బౌలర్లు పుంజుకుని, శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా.. మిడిలార్డర్ కుప్పకూలింది. ఏ ఒక్కరూ ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. శనక, హసరంగ అయితే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు మొదట్లో బాగానే రప్ఫాడించింది. 36 పరుగుల వద్ద కుసల్ మెండిస్ రూపంలో తొలి వికెట్ కోల్పోయినా.. పెరీరా, నిస్సాంకా కలిసి పరుగుల వర్షం కురిపించారు. ఎడాపెడా షాట్లతో బౌండరీల మోత మోగించారు. 80 పరుగుల వద్ద నిస్సాంకా ఔట్ అవ్వగా.. మెండిస్, పెరీరా కలిసి జట్టుని నడిపించారు. కానీ.. ఎప్పుడైతే ఆ ఇద్దరు ఔట్ అయ్యారో, అప్పటి నుంచి ఆతిథ్య జట్టు పేకమేడలా కుప్పకూలింది. ఒకదాని తర్వాత మరొక వికెట్ కోల్పోతూ వచ్చింది. భారత బౌలర్ల ధాటికి.. ఏ ఒక్కరూ కూడా నిలకడగా రాణించలేకపోయారు. ఒకరి వెంట మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా.. శ్రీలంక 161/9 స్కోరుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది.


ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. రవి బిష్ణోయ్ మరోసారి తిప్పేశాడు. తన స్పిన్ మాయాజాలంతో కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులే ఇచ్చా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. భారత్ 162 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇదేం పెద్ద లక్ష్యం కాదు కాబట్టి.. టీమిండియా సునాయాసంగా గెలుస్తుందని అనుకోవచ్చు. కాకపోతే.. ఆవేశంగా కాకుండా ఆచితూచి ఆడాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. టీ20 సిరీస్ భారత్ కైవసం అయినట్టే. మరి.. శ్రీలంక బౌలర్లు తామిచ్చిన మోస్తరు లక్ష్యాన్ని డిఫెండ్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.

Updated Date - Jul 28 , 2024 | 09:47 PM