అడిలైడ్‌లో.. గుభాళించేనా?
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:31 AM
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియాకు నేటి నుంచి అసలైన సవాల్ ఎదురుకానుంది. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి రెండో టెస్టు జరుగనుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో...
నేటి నుంచి డే/నైట్ టెస్టు
ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
పూర్తి స్థాయి జట్టుతో టీమిండియా
మిడిలార్డర్‌లో రోహిత్
విజయంపై ఆసీస్ గురి
అడిలైడ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియాకు నేటి నుంచి అసలైన సవాల్ ఎదురుకానుంది. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి రెండో టెస్టు జరుగనుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో సాగే ఈ డే/నైట్ టెస్టులో గులాబీ బంతితో పరుగులు సాధించడం బ్యాటర్లకు అంత సులువు కాదు. పైగా గతంలో భారత్‌కు ఇక్కడ ఓడిన అనుభవం ఉంది. అయినా తొలి టెస్టు విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో ఆతిథ్య జట్టును కట్టడి చేస్తూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. నాలుగేళ్ల క్రితం అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
టెస్టు ఫార్మాట్‌లో టీమిండియాకు ఇదే చెత్త స్కోరు. 8 వికెట్ల తేడాతో ఆ టెస్టు ఓడిన భారత్‌కు బదులు తీర్చుకునే సమయం వచ్చింది. మరోవైపు పెర్త్ టెస్టులో చిత్తుగా ఓడిన ఆసీస్ దెబ్బతిన్న పులిలా విజయం కోసం ఎదురుచూస్తోంది. అడిలైడ్‌లో మెరుగైన రికార్డు కలిగిన తాము భారత్‌పై నెగ్గి సిరీ్‌సలో సమంగా నిలవాలనుకుంటోంది.
పటిష్టంగా బ్యాటింగ్ లైనప్
తొలి టెస్టుకు దూరంగా ఉన్న గిల్, కెప్టెన్ రోహిత్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో భారత్ పూర్తిస్థాయిలో బరిలోకి దిగబోతోంది. అలాగే అంతా ఊహించినట్టుగా ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా రాహుల్‌నే బరిలోకి దింపనున్నారు. సరైన కాంబినేషన్‌తో ఆడేందుకు రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేశాడు. ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను తప్పించడం అనవసరమంటూ, తను ఐదో స్థానంలో రానున్నాడు. తమకు విజయం మాత్రమే ముఖ్యమని, పెర్త్‌లో ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ అద్భుతంగా రాణించారని రోహిత్ కితాబిచ్చాడు. అందుకే వారి స్థానాలను మార్చాల్సిన అవసరం లేదని తేల్చాడు. కివీ్‌సతో సిరీస్‌లో తను పెద్దగా ఆకట్టుకోలేకపోగా, ఆసీస్ గడ్డపైనా పేలవ గణాంకాలే ఉన్నాయి. ఈ చివరి పర్యటనలోనైనా రోహిత్ బ్యాట్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. వామ్‌పలో హాఫ్ సెంచరీ చేసిన గిల్ జోష్‌లో ఉన్నాడు.
వీరి రాకతో దేవ్‌దత్, జురెల్ బెంచీకే పరిమితం కానున్నారు. విరాట్, జైస్వాల్ శతకాలతో ఫామ్ చాటుకున్నారు. బౌలింగ్ విభాగంలో మార్పులు ఉండకపోవచ్చు. ఏదేమైనా రాత్రి పూట పింక్ బాల్‌తో ఎదురయ్యే అదనపు సీమ్‌ను భారత యువ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే.
ఒత్తిడిలో కంగారూలు..
పెర్త్‌లో మెరుగ్గా రాణించిన పేసర్ హాజెల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆసీ్‌సకు గట్టి షాక్‌గా చెప్పవచ్చు. అలాగే 2020లో భారత్ 36 రన్స్‌కే కుప్పకూలడంలోనూ అతడి పాత్ర (5-3-8-5) ఉంది. తన స్థానంలో 18 నెలల తర్వాత బోలాండ్ మరో టెస్టు ఆడబోతున్నాడు. దీనికి తోడు బుమ్రా బంతులను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాటర్లు తేలిపోతున్నారు. టెస్టు స్పెషలిస్టులు స్మిత్, లబుషేన్ ప్రభావం చూపడం లేదు. ఓపెనర్ మెక్‌స్వీన్ అరంగేట్రంలో ఆకట్టుకోలేకపోయాడు. కాగితంపై పటిష్టంగా కనిపిస్తున్న బ్యాటింగ్ లైనప్.. స్థాయికి తగ్గట్టు ఆడితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
తుది జట్లు (అంచనా)
భారత్: జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, కోహ్లీ, రోహిత్ (కెప్టెన్), పంత్, సుందర్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, బుమ్రా, సిరాజ్.
ఆస్ర్టేలియా: మెక్‌స్వీనే, ఖవాజా, లబుషేన్, స్మిత్, హెడ్, మిచెల్ మార్ష్, క్యారీ, కమిన్స్, స్టార్క్, లియోన్, బోలాండ్.
పిచ్, వాతావరణం
తొలి రోజు మధాహ్నం వర్షం కురిసే అవకాశం 51 శాతం ఉంది. అయితే ఆ తర్వాత తగ్గుముఖం పట్టనుండడంతో మ్యాచ్‌కు అంతరాయం కలగకపోవచ్చు. ఇక అడిలైడ్ పిచ్ బ్యాట్‌కు బంతికి సమతూకంగా ఉండనుంది. ఆరంభంలో పేసర్లు లాభపడతారు. ముఖ్యంగా రాత్రిపూట బంతితో అదనపు స్వింగ్‌ను రాబట్టవచ్చు. మ్యాచ్ సాగేకొద్దీ బ్యాటర్లకు అనుకూలిస్తుంది.
గుర్తుందా.. 36 ఆలౌట్?
2020.. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి టెస్టును అడిలైడ్‌లోనే ఆడింది. ఆ గులాబీ టెస్టును ఏ అభిమానీ గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టపడడంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తమ టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త స్కోరును భారత జట్టు అక్కడే నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయడంతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం కూడా దక్కింది. కానీ ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్లు కమిన్స్, హాజెల్‌వుడ్‌ల ధాటికి కేవలం 36 పరుగులకే కుప్పకూలడం క్రీడా ప్రేమికులను షాక్‌కు గురిచేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ అడిలైడ్‌లో ఆడబోతోంది. అందుకే భారత టెస్టు ఫార్మాట్‌లో పీడకలగా మిగిలిన ఆ పరాభవానికి ఇప్పుడు గట్టిగానే బదులు తీర్చుకోవాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు.
ముఖాముఖి
ఆ.టె భా. వి ఆ.వి డ్రా టై
108 33 45 29 1
గమనిక: ఆ.టె :ఆడిన టెస్టులు; భా.వి: భారత్ విజయం;ఆ.వి: ఆసీస్ విజయం
1
అడిలైడ్‌లో జరిగిన 7 గులాబీ టెస్టుల్లోనూ ఆసీస్ గెలిచింది. ఓవరాల్‌గా స్వదేశంలో జరిగిన 12 డే/నైట్ టెస్టుల్లో 11-1 రికార్డుతో ఉంది. అలాగే భారత్ ఆడిన నాలుగు పింక్ టెస్టుల్లో స్వదేశంలో మూడు నెగ్గి ఆసీస్‌గడ్డపై ఒకదానిలో ఓడింది.
1
విరాట్ మరో సెంచరీ సాధిస్తే అడిలైడ్‌లో నాలుగు శతకాలు సాధించిన విదేశీ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు.