Share News

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

ABN , Publish Date - Nov 19 , 2024 | 02:06 AM

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

Rajanna Sirisilla: వేములవాడ అభివృద్ధికి రూ.127 కోట్లు

  • ఆలయ కాంప్లెక్స్‌, వసతులకు రూ.76 కోట్లు.. రోడ్లకు 47 కోట్లు

  • రేపు ముఖ్యమంత్రి పర్యటన

సిరిసిల్ల, హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజన్న సిరిస్లిల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆలయ అభివృద్ధికి సోమవారం రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ కాంప్లెక్స్‌ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాల కల్పనకు రూ.76 కోట్లు కేటాయించారు. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్లను వెడల్పు చేసేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రోడ్లు విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు.


మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్‌ జంక్షన్‌ వరకు పైప్‌లైన్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించారు. ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన తదుపరి చర్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌, వేలములవాడ ఆలయ పాలకవర్గం చేపట్టాలని దానకిషోర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేయడం పట్ల రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 02:06 AM