Big Breaking: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ABN , Publish Date - Mar 22 , 2024 | 01:49 PM
Telangana Lok Sabha Polls: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు సిట్టింగ్ ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కారు దిగి హస్తం, కాషాయ గూటికి వెళ్లిపోతున్న పరిస్థితి..
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (Telangana Elections) కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు సిట్టింగ్ ఎంపీలు.. మరోవైపు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కారు దిగి హస్తం, కాషాయ గూటికి వెళ్లిపోతున్న పరిస్థితి. దీంతో అభ్యర్థుల దొరక్క బీఆర్ఎస్ (BRS) నానా తిప్పలు పడాల్సి వచ్చింది. దీంతో ఎమ్మెల్యేలుగా ఓడిన, మాజీ మంత్రులను.. ఇతర పార్టీల నుంచి వచ్చిన.. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడిన నేతలకు టికెట్లు ఇచ్చే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. తాజాగా మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఇదిగో ఈ రెండు స్థానాలే..
నాగర్ కర్నల్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (మాజీ ఐపీఎస్ అధికారి)
మెదక్ : వెంకట్రామిరెడ్డి (మాజీ ఐఏఎస్ అధికారి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ).
ఇద్దరూ ఇద్దరే..!
ఈ ఇద్దరిలో ఒకరు ఐపీఎస్‌గా.. మరొకరు ఐఏఎస్‌గా పనిచేసిన వారు. ఇద్దరూ వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారే. ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్న ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీఎస్పీలో చేరిన ఆయన్ను తెలంగాణ అధ్యక్ష పదవి కూడా వరించింది. అయితే.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో నెలకొన్న విబేధాలతో బీఎస్పీకి రాజీనామా చేసి.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మొదట్నుంచీ నాగర్‌కర్నూలు నుంచి పోటీచేయాలని భావించారు.. అనుకున్నట్లుగానే ఆయనకే టికెట్ దక్కింది.
మెదక్ సీటు విషయానికొస్తే.. మొదట ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే అని కూడా టాక్ నడిచింది. సీన్ కట్ చేస్తే.. ఒంటేరు స్థానంలో వెంకట్రామిరెడ్డిని ప్రకటించేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాతో ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌కు కలెక్టర్‌గా, ఇంచార్జీ కలెక్టర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దీంతోపాటు కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోవైపు.. వెంకట్రామిరెడ్డికి టికెట్ దక్కడంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి ఎవరనే విషయం ఇంకా తేలలేదు.
ఇప్పటి వరకూ అభ్యర్థులు ఇలా..
చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
వరంగల్ : డాక్టర్ కడియం కావ్య
మల్కాజ్‌గిరి : రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ : ఆత్రం సక్కు
జహీరాబాద్ : గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ : బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్ : బోయినిపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి : కొప్పుల ఈశ్వర్
మహబూబ్ నగర్ : మన్నె శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం : నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్ : మాలోత్ కవిత
మెదక్ : వెంకట్రామిరెడ్డి
నాగర్ కర్నూలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి