Gachibowli: మహిళపై ఆటోలో అత్యాచారం..
ABN , Publish Date - Oct 16 , 2024 | 03:52 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణం జరిగింది. ఒంటరిగా తన ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఘోరం
అర్ధరాత్రి తర్వాత ఒంటరిగా ఆటో ఎక్కిన బాధితురాలు
నిర్మానుష్య ప్రాంతంలో ఆటోడ్రైవర్ అఘాయిత్యం
పోలీసుల అదుపులో నిందితుడు ?
రాయదుర్గం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణం జరిగింది. ఒంటరిగా తన ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. సోమవారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 40 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ కొండాపూర్ వెళ్లేందుకు సోమవారం అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆర్‌సీ పురం పోలీసు స్టేషన్ సర్కిల్ వద్ద ఆటో ఎక్కింది.
ఆటో మసీద్‌బండ ప్రాంతానికి రాగానే డ్రైవర్ వాహనాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. వెనుక సీట్లో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ మహిళ కేకలు విని అటుగా వెళుతున్న వాహనదారులు ఆటో వద్దకు చేరే సరికి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడైన ఆటో డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది.
బాధితురాలి పొంతన లేని సమాధానాలు.
బాధితురాలు పోలీసులు విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. తాను ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థలో పని చేస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఆ సంస్థకు ఫోన్ చేసి పోలీసులు విచారించగా.. ఆ మహిళ తమ ఉద్యోగి కాదని, తమకు ఎస్‌ఆర్‌నగర్‌లో కార్యాలయం లేదని చెప్పారు. అంతేకాక, వైద్య పరీక్షలకు తొలుత నిరాకరించిన బాధితురాలు తర్వాత అంగీకరించినట్టు తెలిసింది. అలాగే, బాధితురాలు చెబుతున్న చిరునామా, వివరాలకు పొంతన లేనట్టు సమాచారం. మరోపక్క, బాధితురాలు పేర్కొన్న నిర్మానుష్య ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఆటోకు నెంబర్‌ప్లేట్ లేకపోవడం దర్యాప్తునకు ఇబ్బందిగా మారింది.