అవినీతి బీఆర్‌ఎస్ నుంచి పారిపోతున్న అభ్యర్థులు
ABN , Publish Date - Apr 20 , 2024 | 11:10 AM
లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయలేమంటూ ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
- ఆగస్టులో రుణమాఫీ, వానాకాలం
- ధాన్యానికి 500 బోనస్: పొన్నం
హుస్నాబాద్ రూరల్/సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 19: లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేయలేమంటూ ఆ పార్టీ అభ్యర్థులే పారిపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం సిరిసిల్ల, హుస్నాబాద్‌లలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే జీర్జించుకోలేకపోతున్నారని, ఏడాదిలోనే ప్రభుత్వం కూలిపోతుందంటూ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఒక్కసారి కాంగ్రె్‌సను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. తాను భయపడి కరీంనగర్ నుంచి పారిపోయానని ఓ బీజేపీ నాయకుడు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తాను మొగాడిని కాబట్టే హుస్నాబాద్‌లో గెలిచానని స్పష్టంచేశారు. మోదీ గుజరాత్‌ను వీడి, వారాణసీలో పోటీ చేసి గెలవడం లేదా? అని ప్రశ్నించారు. సిరిసిల్లకు రావాల్సిన టెక్స్‌టైల్ పార్క్ వరంగల్‌కు వెళ్తుంటే ఆపలేని దద్దమ్మ ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి, రూ.60 కోట్ల అప్పు చేస్తే, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని దుయ్యబట్టారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని, వచ్చే వర్షాకాలం ధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టారీతిన లక్షల కోట్లు ప్రొసీడింగ్స్ ఇచ్చిందని ఆరోపించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు పెండింగ్ పెట్టిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను కించపరిచే విధంగా మాట్లాడిన మోదీని ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు.