Share News

Hyderabad: సింగరేణి మనుగడ ఎలా?

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:48 AM

ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్లలేక, వాటిని దక్కించుకోలేని దీన స్థితి.

Hyderabad: సింగరేణి మనుగడ ఎలా?

  • రోజురోజుకూ కరిగిపోతున్న బొగ్గు నిల్వలు

  • వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే

  • ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్‌

  • వేలంలో ప్రైవేటు సంస్థలపాలైన రెండు బ్లాకులు

  • వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికార్లు

  • సింగరేణికి గనులను కేంద్రం ఉదారంగా

  • కేటాయించాలి: అధికార, విపక్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్లలేక, వాటిని దక్కించుకోలేని దీన స్థితి. దీంతో 135 ఏళ్ల చరిత్ర కలిగి, ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా, తెలంగాణ కొంగు బంగారంగా వెలుగుతున్న సింగరేణి సంస్థ ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాస్తవానికి సింగరేణికి 2015కు ముందు గోదావరి-ప్రాణహిత లోయలో 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బొగ్గు నిల్వలపై గుత్తాధిపత్యం ఉండేది. అయితే ఆ తరువాత నుంచి గనుల కోసం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బొగ్గు బావులు పొందాలంటే ప్రభుత్వరంగ సంస్థలు కూడా ప్రైవే టు సంస్థలతోపాటే బిడ్డింగ్‌లో పాల్గొనాలంటూ కేంద్ర ప్రభుత్వం మైన్స్‌ అండ్‌ మినరల్‌ (డెవల్‌పమెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌-2016 ప్రకారం వేలం పాటలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2020 నుంచి బొగ్గు గనుల వేలం దేశంలో ముమ్మరంగా జరుగుతోంది.


ఇప్పటికే తొమ్మిదిసార్లు వేలం నిర్వహించగా 10వ విడత వేలం హైదరాబాద్‌లోనే జరిగింది. ఇందులో.. బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి స్వయంగా అన్వేషించిన బ్లాకులు, అందులోనూ ఆ సంస్థ ఇప్పటికే మైనింగ్‌ చేస్తున్న బ్లాకుల ముందు, వెనుక ఉన్న బ్లాకులను కూడా ఇతర సంస్థలు ఎగరేసుకుపోయాయి. సింగరేణి మాత్రం ప్రభుత్వ అనుమతి లేక వేలంలో పాల్గొనలేని పరిస్థితిలో ఉంది. అయితే ఎంఎండీఆర్‌ యాక్ట్‌-2016లోని సెక్షన్‌ 17(2)ఏ ప్రకారం దక్కిన ప్రత్యేక అధికారాలతో బొగ్గు బ్లాకులను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థకు కేటాయించే విచక్షణ కేంద్రానికి ఉంది. ఈ చట్టం ప్రకారంబొగ్గు బ్లాకులను సింగరేణికి రిజర్వ్‌ చేయవచ్చు. ప్రస్తుతం కేంద్రాన్ని తెలంగాణ ఇదే కోరుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతోపాటు విపక్షాలు కూడా కేంద్రానికి ఉన్న విచక్షణతో సింగరేణికి బ్లాకులు కేటాయించాలని తాజాగా నివేదించారు. అయితే ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ.. ఎక్కడా విచక్షణతో బ్లాకులు కేటాయిస్తామనే హామీ మాత్రం ఇవ్వలేదు.


12కు చేరనున్న సింగరేణి గనులు!

సింగరేణి సంస్థ ప్రస్తుతం 39 బొగ్గు గనుల్లో మైనింగ్‌ చేస్తోంది. వీటిలో రానున్న ఐదేళ్లలో 8 భూగ ర్భ గనులు, మూడు ఓపెన్‌కాస్టులు మూతపడనున్నాయి. ఆ తర్వాత మరో ఐదేళ్లలో అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్‌ కాస్టులు కలిపి... 11 గనులు బంద్‌ కానున్నాయి. 2037-38 నాటికి ఇంకో 5 గనులు మూతపడనుండగా... 12 గనులకు సింగరేణి కుదించుకుపోనుంది. 2014 నాటికి సింగరేణిలో కార్మికుల సంఖ్య 60 వేలకు పైగా ఉండగా... ప్రస్తుతం 40 వేలకు తగ్గింది. రానున్న 15 ఏళ్లలో గనుల సంఖ్య 12కు తగ్గి.. కార్మికుల సంఖ్య 8వేల మందికి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడనుంది. కాగా, గడచిన పదేళ్లలో సింగరేణి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.49,666 కోట్లను పన్నుల రూపంలో చెల్లించింది.


రాష్ట్ర ప్రభుత్వానికి 9 రకాల ట్యాక్సులు, రాయల్టీల రూపంలో రూ.23,446 కోట్లను చెల్లించగా, కేంద్ర ప్రభుత్వానికి 21 రకాల పన్నుల ద్వారా రూ.26,207 కోట్లు చెల్లించింది. అంతేకాదు.. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వివిధ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, సీవరేజీ, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనాల నిర్మాణం వంటి వాటికి జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌(డీఎంఎ్‌ఫటీ) కింద రూ.3 వేల కోట్లను, సామాజిక బాధ్యత కార్యక్రమాల అమలు(సీఎ్‌సఆర్‌) కింద భారీగా నిధులు వెచ్చించింది. ఇలాంటి సంస్థ కోసం కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గనులు కేటాయించాల్సిన బాధ్యత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఆ తీర్పులో ప్రభుత్వ రంగానికి రక్షణ

బొగ్గు గనుల విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకు సుప్రీంకోర్టు గతంలోనే తమ తీర్పు ద్వారా రక్షణ కల్పించింది. 2014 ఆగస్టు 25వ తేదీన బొగ్గు బావులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసె్‌ఫల నేతృత్వంలోని ధర్మాసనం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు సందర్భంగా 1993 నుంచి 2010 మధ్యలో కేటాయించిన 214 కోల్‌బ్లాకుల లీజును సుప్రీంకోర్టు రద్దు చేస్తూ.. ప్రభుత్వరంగ సంస్థలు సెయిల్‌, ఎన్‌టీపీసీకి ఇచ్చిన లీజులకు రక్షణ కల్పించింది. అయితే సింగరేణి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ కావడంతో దీనికి కేటాయింపులు ఏ విధంగానూ చట్టవిరుద్ధం కావని పలువురు గుర్తు చేస్తున్నారు.


వేలంతోనే మేలు!

వేలం పాటతోనే సింగరేణికి మేలు జరుగుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. నామినేషన్‌ పద్ధతిలో పొందిన బ్లాకుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తే 14ు దాకా రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే అదే వేలం పాటలో అయితే 2022 నుంచి ఉన్న నిబంధన ప్రకారం కనిష్ఠంగా 4ు నుంచి పాట మొదలవుతుంది. ఈ మేరకు కోయగూడం బ్లాకును 5ు రాయల్టీ, సత్తుపల్లి బ్లాకును 7.5ు రాయల్టీ చెల్లించడానికి అంగీకరిస్తూ ప్రైవేట్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఏ లెక్కన చూసుకున్నా వేలం పాటలో సింగరేణి పాల్గొంటే ఏ గని అయినా 10 శాతం లోపే దక్కేదని అధికారులు గుర్తు చేస్తున్నారు.


సత్తుపల్లి, కోయగూడెం బ్లాకులు.. సింగరేణి ఇప్పటికే తవ్వకాలు జరుపుతున్న బ్లాకుల మధ్య ఉండటం వల్ల ఆయా బ్లాకుల్లో ఉత్పత్తి ద్వారా ఏటా 5 మిలియన్‌ టన్నుల బొగ్గును తక్కువ ధరకే ఉత్పత్తి చేసే అవకాశాన్ని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సింగరేణికి స్వేచ్ఛ ఇస్తే.. బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని, కోల్‌బెల్ట్‌లో ఉన్న బ్లాకులను దక్కించుకొని, మనుగడను కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 03:48 AM