Bhatti Vikramarka: సాగుకు సలాం..
ABN , Publish Date - Jul 26 , 2024 | 03:43 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ముందునుంచీ చెబుతున్నట్లుగానే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.2,91,159 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అత్యధికంగా రూ.72,569 కోట్లను వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నట్లు తెలిపారు.
బడ్జెట్లో నిధుల కేటాయింపే నిదర్శనం
ఈ ఏడాది ఫసల్ బీమా యోజనలోకి రాష్ట్రం
పంటలు సాగు చేసే అర్హులకే రైతు భరోసా
ఈ ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
త్వరలోనే ఉద్యోగ నియామక క్యాలెండర్
బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ముందునుంచీ చెబుతున్నట్లుగానే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.2,91,159 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అత్యధికంగా రూ.72,569 కోట్లను వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనేదానికి ఈ కేటాయింపులే నిదర్శనమన్నారు. గురువారం శాసనసభలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 12:02 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం 1:57 గంటలకు ముగిసింది. భట్టివిక్రమార్క ప్రసంగిస్తూ.. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయతీ పునాదులుగా ఏర్పడిన ప్రభుత్వానికి అలవికాని హామీలేవీ లేవని నిరూపించామన్నారు. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ ఆశయాలను సమన్వయపరిచి.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచాలనే దృఢ దీక్షతో ఉన్నామన్నారు. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా, ప్రజల భాగసామ్యంతో ఖరారు కావాలే తప్ప.. నాలుగు గోడల గడీల మధ్య కాదని వ్యాఖ్యానించారు.
సన్నరకం ధాన్యానికి బోనస్..
రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి వీలుగా 33 రకాల సన్నాలను గుర్తించి, క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. దీంతోపాటు భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులను మార్చడానికిగాను వారికి ఏటా రూ.12 వేల చొప్పున అందజేస్తామన్నారు. ఇక ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరనున్నామని, ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుల రూ.2 లక్షల రుణమాఫీకిగాను రూ.31 వేల కోట్లను సమీకరించుకుంటున్నట్లు తెలిపారు. రూ.లక్ష దాకా రుణం ఉన్న 11.34 లక్షల మంది రైతులకు ఈ నెల 18నే మాఫీ చేశామని, పూర్తి నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. పంటలు సాగుచేసే, అర్హులైన రైతులకే ఈ సాయం అందించనున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని సేకరణ కేంద్రాలకు తరలించేలా గంటగంటకూ వాతావరణ సమాచారం తెలియజేసే యాప్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
వామనావతారంలా అప్పులు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.75,577 కోట్లుగా ఉన్న అప్పు.. రోజు రోజుకూ వామనావతారంలా పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. గతేడాది డిసెంబరు నాటికి ఈ అప్పులు రూ.6,71,757 కోట్లకు చేరాయని తెలిపారు. గత దశాబ్దకాలంలో తప్పుడు నిర్ణయాల వల్ల సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన ఫలితాలు సాధించలేదన్నారు. కాలువల ద్వారా నీళ్లు కాకుండా.. అవినీతి సొమ్మును ప్రవహింపచేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసిందని ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో.. ఎంతో సమృద్ధిగా, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు చెల్లింపులు కూడా సకాలంలో చేయలేకపోయారని ఆక్షేపించారు. తాము దుబారా ఖర్చులను కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని, ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తారీకున వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో అప్పులు చెల్లించడానికి కూడా మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
త్వరలోనే జాబ్ క్యాలెండర్..
గత దశాబ్ద కాలంలో ఉద్యోగ నియామకాల విషయాన్ని పక్కనపెడితే.. అరకొర నియామకాల్లోనూ అక్రమాలు, పేపర్ లీకేజీలు చోటుచేసుకున్నాయని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సమూలంగా ప్రక్షాళన చేశామని, ఇప్పటిదాకా 31,768 మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. నియామక ప్రణాళిక క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సొంత జాగా ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో 4.50 లక్షల మందికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకుగాను ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా రూ.లక్ష కోట్ల సాయం అందించాలన్నది లక్ష్యమన్నారు.
థేమ్స్ తరహాలో మూసీ అభివృద్ధి..
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. మూసీని లండన్‌లోని థేమ్స్ నది తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెట్రో కారిడార్ల విస్తరణ చేపట్టనున్నట్లు, రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ ప్రాంతాల రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులు బోధించడానికి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వర్సిటీలకు వీసీల నియామకం, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా టెక్నాలజీతో అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా ఆరు కొత్త దీర్ఘకాలిక కోర్సుల్లో ఏటా 5860 మందికి విద్యార్థులకు, స్వల్పకాలిక కోర్సుల్లో 31,200 మందికి శిక్షణ ఇస్తామన్నారు.
భట్టిని ఆప్యాయంగా కౌగిలించుకున్న రేవంత్
ఉదయం 11:45 గంటలకే శాసనసభలోకి అడుగుపెట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగంపై కాసేపు రిహార్సల్స్ చేశారు. ఆ తర్వాత 11:59 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలోకి వచ్చిరాగానే భట్టి విక్రమార్కను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాకా అధికార పార్టీ సభ్యులంతా సీఎంకు, డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు.
బడ్జెట్ ప్రసంగంలోని కీలకాంశాలు..
ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఆరోగ్య సేవలు అందించడానికి వీలుగా ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ .
ధరణి కమిటీ అధ్యయనం పూర్తయ్యాక.. శాశ్వత పరిష్కారం దిశగా తగిన చర్యలు.
వివిధ వర్గాల విద్యార్థుల మధ్య స్నేహభావం పెరిగి, అంతరాలు తగ్గించేందుకు 20 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలను కలిపి సమీకృత గురుకులాల నిర్మాణం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక నిధులు.
ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల సబ్సిడీకి రూ.16,410 కోట్ల నిధులు. ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్‌ట్రా హైవోల్టేజీ సబ్‌స్టేషన్ల నిర్మాణం. 31 ఎక్స్‌ట్రా హైవోల్టేజీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు కోసం నిధులు. 2030 దాకా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళిక కోసం నూతన ఇంధన పాలసీ. ఎలక్ట్రిక్ వాహనదారులకు చార్జింగ్ కేంద్రాల సమాచారం ఇవ్వడానికి వీలుగా టీజీఈవీ పేరుతో మొబైల్ యాప్ తయారీ.
అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు, వికారాబాద్-అనంతగిరి సర్క్యూట్, కనకగిరి, కుంటాల జలపాతం, కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం సర్య్కూట్‌లలో ఎకో టూరిజం. ఈ ఏడాది 20.02 కోట్ల మొక్కలు నాటడానికి వీలుగా ‘వజ్రోత్సవ వనమహోత్సవం’. అటవీ జంతువుల దాడిలో చనిపోయిన వారికి పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు.
త్వరలోనే నిజాం షుగర్స్ ప్రారంభం.
24 భారీ, 7 మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కోసం బడ్జెట్‌లో ఇరిగేషన్ శాఖకు నిధులు
తెలంగాణ మాదక ద్రవ్యాల నిర్మూలనకు జీరో టాలరెన్స్ విధానం అమలు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడానికి వీలుగా హోంశాఖకు నిధుల కేటాయింపు.
కంటోన్మెంట్ రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి తారు రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రహదారి. జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి అనుసంధానం చేసేలా హైవేల నిర్మాణం. ఈ బడ్జెట్‌లో రోడ్లు భవనాల శాఖకు రూ.5790 కోట్లు.
అరుపులు.. నినాదాల మధ్య ప్రసంగం
తెలంగాణ శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్ ప్రసంగం ఆసాంతం అరుపులు, కేకల మధ్య కొనసాగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో ‘షేమ్ షేమ్.. బోగస్, ఫాల్స్, అబద్ధం’ అంటూ ప్రతిపక్షం నినాదాలు చేయగా.. అధికార పక్షం కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేదాకా ఇలా నినాదాలు కొనసాగాయి. మధ్యలో రెండు మూడుసార్లు మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ కూడా ఇతర బీఆర్‌ఎస్ సభ్యులతో గొంతు కలిపారు. ఓ దశలో ప్రతిపక్ష నేత కేసీఆర్.. వెనక్కి తిరిగి నినాదాలు చేసే సభ్యుల వైపు చూశారు. అధికార పక్ష సభ్యులతో కలిసి మంత్రులు కూడా విపక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. కాగా, బడ్జెట్ ప్రసంగంలో పలు చోట్ల రిఫరెన్స్‌లుగా దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, జాతిపిత మహాత్మాగాంధీ సూక్తులతో సాగింది.
చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి: ఉత్తమ్
నీటిపారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించడాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వాగతించారు. ఈ నిధులతో చివరి దశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. అలాగే పౌర సరఫరాల శాఖకు రూ.3,836 కోట్లు కేటాయించడాన్ని ఉత్తమ్ స్వాగతించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చే స్పష్టమైన విజన్.. బడ్జెట్లో కనిపించిందన్నారు.
శాసనసభ రేపటికి వాయిదా
శాసనసభ శనివారానికి వాయిదా పడింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటన చేశారు.
1న క్యాబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 1న జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇందుకు సంబంధించిన సర్క్యులర్‌ను గురువారం జారీ చేశారు. ఆగస్టు 1న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగే ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే కొన్ని బిల్లులతోపాటు, ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.