CPI Narayana: పేదల జోలికొస్తే తాట తీస్తాం.. ‘దానం’ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి..
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:54 AM
బేగంపేటలోని ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ(CPI National Secretary Dr. K. Narayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- బాదితులకు సీపీఐ అండగా ఉంటుంది
- బేగంపేటలోని ప్రశాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో పర్యటించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
బేగంపేట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): బేగంపేటలోని ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ(CPI National Secretary Dr. K. Narayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఈ.టి నరసింహ, జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, సనత్‌నగర్ నియోజకవర్గం కార్యదర్శి ఎండి సలీం ఖాన్‌లతో కలిసి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. కూల్చివేసిన ఇళ్లు తిరిగి నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని బస్తీ వాసులకు హామి ఇచ్చారు. దానం నాగేందర్ అనుచరులు తిరిగి పేదల జోలికొస్తే తాట తీస్తామని ఈ సందర్బంగా నారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఇంతియాజ్ ఖాన్, సైఫ్‌ఖాన్, జావీద్, వెంకటేష్, దశరధ్ తో పాటు స్థానికులు పాల్గొన్నారు.
నిజ నిర్ధారణ కమిటీ పర్యటన...
బేగంపేట ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ పేదల ఇళ్లను నాయకులు బెదిరించి ఖాళీ చేయిస్తున్నారని జనవరి 2న బస్తీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో అసలు విషయం తెలుసుకునేందుకు ఈనెల 3వ తేదిన మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ బృందం ప్రకాశ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఇళ్లు కూల్చిన ప్రాంతాన్ని మానవ హక్కుల వేదిక హైదరాబాద్ యూనిట్ ఉపాధ్యక్షులు బిలాల్, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌తో కూడిన బృందం నిజ నిర్ధారణ జరిపింది. జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఆ బస్తీ వాసులకు చట్టరిత్యా నివాస హక్కులు కల్పించాలని కమిటీ డిమాండ్ చేసింది. బస్తీ వాసులకు రౌడీల నుంచి పోలీస్ కమీషనర్ పూర్తి రక్షణ కల్పించాలని, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాత్రపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని నిజనిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది.