Danakishore: నీటి సరఫరాకు ఆటంకం కలిగించే సిబ్బందిని తొలగిస్తాం..
ABN , Publish Date - Apr 14 , 2024 | 08:45 AM
ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించే సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్(Municipal Department Chief Secretary M. Danakishore) హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని వాటర్‌బోర్డు అధికారుల్ని ఆదేశించారు.
- ట్యాంకర్ బుకింగ్ లేకుండా పైపులైన్ కనెక్షన్ సైజ్ పెంచుతాం
- బస్తీల కోసం 70మినీ ట్యాంకర్లను తీసుకొస్తున్నాం
- మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్
హైదరాబాద్ సిటీ: ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించే సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్(Municipal Department Chief Secretary M. Danakishore) హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని వాటర్‌బోర్డు అధికారుల్ని ఆదేశించారు. వేసవిలో తాగునీరు, ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై వాటర్‌బోర్డు ఎండీ సుదర్శన్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ, లైన్‌మన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ ప్రతి మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్రస్థాయిలో లైన్‌మన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లైన్‌మన్లు వాటర్‌బోర్డు రూపొందించిన నాణ్యత యాప్‌లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే.. కారకులైన సిబ్బందిని తొలగించాలని ఆదేశించారు. నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి అదనంగా రోజుకు 20మిలియన్ లీటర్ల నీరు వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం నీటిని శుద్ధి చేసేందుకు మిరాలం, ఆసిఫ్‌నగర్ దగ్గరున్న ఫిల్టర్ బెడ్స్ వంద శాతం పనిచేసేలా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అదనపు నీటిశుద్ధి కేంద్రాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించాలని సూచించారు.
వాతావరణం చల్లబడటంతో..
నగరంలో వాతావరణం చల్లబడటంతో కొంత మేరకు ట్యాంకర్ బుకింగ్స్ తగ్గాయని, అంతకు ముందు రోజుకు 6వేల ట్రిప్పుల చొప్పున నీరు సరఫరా చేస్తే.. ప్రస్తుత 5వేల ట్రిప్పులు సరఫరా చేస్తున్నారని దానకిశోర్ తెలిపారు. ట్యాంకర్ బుక్ చేసుకునే పరిస్థితి లేకుండా వారి కనెక్షన్ సైజ్ పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా 5 కిలో మీటర్లు(కేఎల్) సామర్థ్యం కలిగి న వంద ట్యాంకర్లు రానున్నాయని, ఇరుకుగా ఉన్న కాలనీలు, బస్తీలు, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు 2.5 కేఎల్ సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకర్ డెలివరీ టైమింగ్స్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడున్న ట్యాంకర్లతో పాటు రానున్న వంద ట్యాంకర్లను సమర్థంగా వినియోగించుకుని డెలివరీ సమయాన్ని 12 గంటలకు తగ్గించాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
సాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్లు
నాగార్జున సాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, 15వ తేదీ తర్వాత ఏ క్షణమైనా పంపింగ్ చేసే అవకాశముందని వివరించారు. గ్రేటర్ పరిధిలో నీటిసేకరణ, సరఫరా ప్రాంతాలు, ఇతర వివరాలు సేకరించడానికి ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో ఈడీ. డా.ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు వీఎల్. ప్రవీణ్‌కుమార్, రవికుమార్, స్వామి, సీజీఎంలు, జీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు