Dengue: డెంగీ డేంజర్ బెల్స్ 5,200 కేసులు 8 నెలల్లో..
ABN , Publish Date - Aug 25 , 2024 | 03:04 AM
డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిరేటు 7 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి.
నిరుడు ఇదే కాలంలో 3,800
‘హైరిస్క్’గా 10 జిల్లాలు
సాధారణ జ్వరపీడితులూ భారీగానే..
నెల రోజుల్లో 2.45 లక్షల మంది డెంగీ, మలేరియా, చికున్‌గున్యాపై
వివరాలు వెల్లడించిన డీహెచ్ కార్యాలయం
రాష్ట్రవ్యాప్తంగా డెంగీతో ముగ్గురి మృతి
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిరేటు 7 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టు మూడో వారానికే కేసుల సంఖ్య ఐదు వేలు దాటడం గమనార్హం. నిరుడు ఆగస్టు చివరి నాటికి 3,861 కేసులు నమోదయ్యాయి. అంటే.. నిరుటితో పోల్చితే 35 శాతం మేర కేసుల సంఖ్య పెరిగిందిన్నమాట! రాష్ట్రంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసుల వివరాలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం శనివారం విడుదల చేసింది.
ప్రధానంగా పది జిల్లాల్లో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వాటిని హైరిస్క్ జిల్లాలుగా గుర్తించారు. వీటిలో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,697 డెంగీ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 416, మేడ్చల్‌లో 405, ఖమ్మంలో 346, నల్లగొండలో 322, నిజామాబాద్‌లో 243, రంగారెడ్డిలో 222, జగిత్యాలలో 147, సంగారెడ్డిలో 115, వరంగల్‌లో 102 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు డెంగీతో ఒక్కరూ కూడా చనిపోలేదని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం చెబుతోంది. వాస్తవానికి ఇప్పటికే డెంగీ మరణాలు నమోదు అవుతున్నాయి.
అయితే డీహెచ్ చెప్పేలెక్కలకు క్షేత్రస్థాయిలో నమోదయ్యే కేసులకు భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం ఒక్క రోజే ఐదుగురు డెంగీతో మరణించారు. జిల్లాల్లో ప్రతిరోజూ డెంగీ మరణాలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో వైరల్ జ్వరాలు విజృంభణ కొనసాగుతోంది. కొన్ని పల్లెల్లో ఇంటికొకరు చొప్పున మంచం పట్టారు. కానీ వైద్యశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 2,45,111 మందే జ్వర బాధితులున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఇంటింటా సర్వే నిర్వహించింది.
మొత్తం 1,27,49,028 గృహాలను సందర్శించినట్లు ప్రజారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఇంటింట జ్వర సర్వేలో మొత్తం 3.91 కోట్ల మందిని స్ర్కీనింగ్ చేశామని, అందులో 2.45 లక్షల మంది జ్వర బాధితులున్నట్లు డీహెచ్ కార్యాలయపు లెక్కలు పేర్కొన్నాయి. ఇక చికెన్‌గున్యా కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మూడోవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 106 చికున్‌గున్యా కేసులొచ్చాయి. మొత్తం 2036 నమూనాలను పరీక్షించగా ఆ కేసులొచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో చికున్‌గున్యా హైరి్‌స్కలో ఉన్న జిల్లాల్లో జాబితాలో హైదరాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్ ఉన్నాయి.
ఈ మూడు జిల్లాలోనే 75 కేసులు నమోదయ్యాయి. నిజానికి చికున్‌గున్యా కేసుల సంఖ్య కూడా వైద్యశాఖ వెల్లడించిన దానికంటే వందలరెట్లు ఎక్కువగా ఉన్నాయి. మలేరియా కేసులు ఆగస్టు మూడోవారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా 188 వచ్చాయి. మొత్తం 22.79 లక్షల నమూనాలను పరీక్షించగా ఆ కేసులు వచ్చినట్లు గణాంకాలు పేర్కొన్నాయి.
కట్టడిలో వైఫల్యం...
సీజనల్ వ్యాధుల నియంత్రణ, అవగాహనపై వేసవిలోనే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. కట్టుదిట్టమైన ప్రణాళికలతోనే ఇది సాఽధ్యమవుతుంది. కానీ ప్రజారోగ్య శాఖలో అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు లేకపోవడంతో ఈ ఏడాది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఒక్కరోజు కూడా పనిజేయని వారిని సీనియారిటీ పేరుతో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, దానికితోడు అనుభవరాహిత్యం కూడా ప్రధాన కారణమని, క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ను హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా గాంధీ ఆస్పత్రి
రాష్ట్రంలో రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు రవీంద్రనాయక్ తెలిపారు. శనివారం కోఠీలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,648 డెంగీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. నిరుటితో పొల్చితే ఈ ఏడాది డెంగీ కేసులు బాగా పెరుగుతున్నాయని ప్రకటించారు. డెంగీతో పాటు చికున్‌గున్యా కేసులు కూడా పెరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 106 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మంకీపాక్స్ నోడల్ కేంద్రంగా గాంధీ ఆస్పత్రిని ఏర్పాటు చేశామ చెప్పారు.