Share News

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

ABN , Publish Date - Oct 26 , 2024 | 04:33 AM

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

  • భూ బదలాయింపుల కేసులో 2 పేర్లు తెరపైకి

  • 9 గంటల పాటు అమోయ్‌ కుమార్‌ విచారణ

  • పాత కలెక్టరేట్‌కి తీసుకెళ్లి ప్రశ్నించిన ఈడీ

  • త్వరలో మరికొందరికి నోటీసులిచ్చే అవకాశం

  • తట్టి అన్నారంలో వెయ్యి కోట్ల భూమికి టెండర్‌

  • అమోయ్‌ కుమార్‌పై ఈడీకి మరో ఫిర్యాదు

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను శుక్రవారం వరుసగా మూడోరోజు తన కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘంగా విచారించింది. విచారణలో భూదాన్‌ భూముల బదలాయింపు కేసులో రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో ఒకరు ఉన్నతాధికారిగా రిటైర్‌ అయిన ఐఏఎస్‌ కాగా, మరొకరు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్నారు. దాంతో కేసు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది.


అమోయ్‌ కుమార్‌ను శుక్రవారం ఉదయం 8.30 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు విచారించిన ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. కొన్ని ప్రశ్నలకు అమోయ్‌ నుంచి సరైన సమాధానాలు రాలేదని, కొన్నింటికి తెలియదని, మరి కొన్నింటికి గుర్తులేదని చెప్పినట్లు సమాచారం. రూ.వందల కోట్లు విలువైన భూదాన్‌ భూములు ఎవరి ప్రమేయంతో, ప్రోద్భలంతో బదలాయించాల్సి వచ్చిందనే అంశంపైనే ఈడీ ప్రధానంగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అమోయ్‌ను మధ్యలో పాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌కు తీసుకెళ్లి,నిమిషాల వ్యవధిలోనే తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి పంపించారు. ఇప్పటి వరకు లభించిన సమాచారం, వివరాల ఆధారంగా ఈ కేసులో ఈడీ మరికొందరికి నోటీసులు పంపించేందుకు రంగం సిద్ధం చేసింది.


  • తహసీల్దార్‌ జ్యోతి ఇచ్చిన వివరాలతో ప్రశ్నలు

మహేశ్వరం పోలీ్‌సలు గత ఏడాది మార్చిలో నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. ఎఫ్‌ఐఆర్‌ నెం.83/2023లో మహేశ్వరం తహసీల్దార్‌ జ్యోతితో పాటు మరికొందరిపై పోలీ్‌సలు కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేశారు. వాటి ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ జ్యోతితో పాటు మరికొందరిని పిలిపించి ప్రశ్నించింది. వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి,అమోయ్‌ను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు. గతంలో జ్యోతి చెప్పిన అంశాలు, ఇప్పుడు అమోయ్‌ ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అమోయ్‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో జరిగిన భూ లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ప్రమేయంపై కొంత స్పష్టత వచ్చినట్లు తెలిసింది. సీనియర్‌ ఐఏఎస్‌ ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.


  • అమోయ్‌పై ఫిర్యాదు

పశు సంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌పై ఈడీకి మరో ఫిర్యాదు అందింది. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం గ్రామం మధురానగర్‌ కాలనీ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు అమోయ్‌ కుమార్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. సర్వే నెంబరు 108, 109, 110, 111లో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 800 ప్లాట్లు తయారు చేసి, వేర్వేరు వ్యక్తులకు విక్రయించారని ఈ విషయంలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రామ్మోహన్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజ్‌గిరి కంటెస్టెడ్‌ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. 70 ఎకరాల 39 గుంటల భూమి మట్టాదారుడు సత్యనారాయణ రెడ్డి 1982లో 840 ప్లాట్లతో వెంచర్‌ చేసి విక్రయించాడన్నారు. భూమి ధరలు పెరగడంతో కొందరు ఆక్రమించుకున్నారని, వారితో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హోదాలో అమోయ్‌ కుమార్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇదే విషయమై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని, ఆయనపై ఈడీ విచారణ కొనసాగుతున్నందున ఇక్కడ కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.


  • 29న ఎన్‌ఐసీ చేతికి ధరణి

ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం టెర్రాసిస్‌ అనే సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆ సంస్థతో ఒప్పందం ఈ నెల 29తో ముగుస్తుంది. అదే రోజున ఎన్‌ఐసీ చేతికి అప్పగించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, ధరణి పోర్టల్‌ పర్యవేక్షిస్తున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్‌ఐసీ అధికారులు, టెర్రాసిస్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ప్రతినిధులతో సమావేశం జరిగింది. రికార్డుల నిర్వహణ, అన్ని రకాల క్రెడెన్షియల్స్‌ అప్పగింతలపై అధికారులు చర్చించారు.


  • రూ.2 వేల కోట్లపైనే!

అమోయ్‌ చేసిన భూ బదలాయింపుల విలువ రూ.2 వేల కోట్లపైనే ఉంటుందని ఆయన తోటి అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఆయన గతంలో పని చేసిన ప్రాంతాల్లో తనతో పనిచేసిన కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగులు, ఆయన తర్వాత సదరు జిల్లాలకు కలెక్టర్లుగా పని చేసిన ఐఏఎస్‌ అధికారులు తమ మెడకు ఏం చుట్టుకుంటుందోనని హడలిపోతున్నారు. మరోపక్క అమోయ్‌ చేతుల మీదుగా జరిగిన భూబదలాయింపుల మీద ఈడీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఖాజాగూడలో ఓ ప్రముఖ బిల్డర్‌కు 27 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టా చేయించడం పైన, శంషాబాద్‌ దగ్గర సుల్తాన్‌పల్లిలో 40 ఎకరాలు, నార్సింగ్‌ సమీపంలో పుప్పాలగూడ వద్ద ఓ చెరువును ప్రైవేటు భూమిగా చూపి రియల్టర్ల చేతిలో పెట్టారనే అంశాల మీద ఈడీకి ఫిర్యాదులు అందినట్లు చర్చ జరుగుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో అంధుల పాఠశాలకు చెందిన 30 ఎకరాలను ఓ వ్యక్తి పేరు మీద పట్టా చేశారని, దివ్యాంగులు తిరుగుబాటు చేయడంతో ఆయన తర్వాత కలెక్టర్‌గా వెళ్లిన మరొకరు రద్దు చేశారని ఈడీకి సమాచారం అందింది. గంధంగూడలో ఓ వ్యక్తి పేరుతో 9 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా ఇచ్చారని, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తరువాత రద్దు చేశారనే విషయాలు చర్చకు వచ్చాయి.

Updated Date - Oct 26 , 2024 | 04:33 AM