Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ ఓటమికి కారణం అదే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 28 , 2024 | 08:53 PM
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చెప్పారు. దళిత బందు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలేంటో చెప్పారు. దళిత బందు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని పేర్కొన్నారు. దళిత బందు పథకం పద్ధతిగా ఇచ్చి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దళిత బందు పథకంతోనే గిరిజన బందు ఇవ్వాలని కొందరు, అలాగే బీసీ బందు ఇవ్వాలని మరికొందరు ముందుకు రావడం వల్ల.. గత ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని చెప్పారు. పాలకుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంకా మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితమే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేస్తే బాగుండేదని, పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయపడ్డారు. కానీ.. ఎన్నికల ముందు పంపిణీ చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో, అలాగే నాయకత్వ నిర్ణయాల్లో లోపాలున్న మాట వాస్తవమేనని చెప్పారు. తాను కూడా కొన్ని తప్పులు చేశానని ఒప్పుకున్నారు. అయితే.. ప్రజలకు తాము సంక్షేమ పథకాలన్నీ అందించామని, అందుకు ప్రజలు ఆదరించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని దయాకర్ రావు కొనియాడారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలకుర్తిలో ప్రజలతో మమేకం కాకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమికి కారణమన్నారు. మనం ఎన్ని పనులు చేశాం, ఎన్ని పదవులిచ్చాం, ఎన్ని పైసలిచ్చాం అనేది ముఖ్యం కాదని.. ప్రజలతో మానవ సంబంధాలే ప్రధానమని నొక్కి చెప్పారు. మానవ సంబంధాల లోపాల వల్లే పాలకుర్తిలో ఓడిపోయామని అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో తనపై పోటీ చేసిన ప్రత్యర్థి డబ్బుల వరద పారించినా.. ప్రజలు మాత్రం తననే గెలిపించారన్నారు.