Mancherial: మావోయిస్టు మాజీ నేత హుస్సేన్ అరెస్టు..
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:29 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెల్లవారు జామున జమ్మికుంటలో అదుపులోకి
అరెస్టు చూపకపోవడంతో రామకృష్ణాపూర్ పోలీ్‌సస్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఆందోళన
చివరకు సాయంత్రం అరెస్టుపై ప్రకటన
జమ్మికుంట/మంచిర్యాల/రామకృష్ణాపూర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) వ్యవస్థాపకుల్లో ఒకరైన మహ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్ అలియాస్ రమాకాంత్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సంఘాల నేతల ఆందోళనల మధ్య చివరకు సాయంత్రం ఆయన అరెస్టు విషయాన్ని ప్రకటించారు. మహ్మద్ హుస్సేన్.. మందమర్రి ఏరియాలో సింగరేణి కార్మికునిగా పనిచేసే సమయంలో మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. సింగరేణిలో ఒకరోజు సమ్మెకు 8 రోజుల వేతనాన్ని కోత విధించే చట్టాన్ని వ్యతిరేకిస్తూ హుస్సేన్ నాయకత్వంలో 1981 ఏప్రిల్ 18న స్థానిక కేకే-2 గనిలో ఉద్యమం ప్రారంభమైంది. అది దశల వారీగా 56 రోజుల సమ్మెకు దారి తీసింది. తర్వాత కాలంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఝార్ఖండ్‌లో 2009లో అరెస్టయి 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు. అప్పట్నుంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీ్‌సస్టేషన్ వద్ద హైడ్రామా...
హుస్సేన్ అరెస్టు విషయం తెలిసి కుటుంబీకులు, ప్రజా సంఘాల నేతలు రామకృష్ణాపూర్ పోలీ్‌సస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన పోలీసులు.. సాయంత్రం వరకు అరెస్టును ప్రకటించలేదని మండిపడ్డారు. హుస్సేన్‌పై తప్పుడు కేసులు బనాయించారని, ఆయన్ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు శీపతి రాజగోపాల్, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.
సికాస పునర్నిర్మాణం కోసం యత్నిస్తున్నారనే..
సాయంత్రం ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. సికాస పునర్నిర్మాణంలో భాగంగా రామకృష్ణాపూర్ ఏరియాలో హుస్సేన్ తిరుగుతున్నారనే సమాచారం అందిందని.. ఈ క్రమంలోనే ఆర్‌కే1 ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఆయన తారస పడటంతో ఆపడానికి ప్రయత్నించగా పారిపోతుండగా పట్టుకున్నామని చెప్పారు. బ్యాగును తనిఖీ చేయగా మావోయిస్టు డాక్యుమెంట్లు, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు లభించాయని వెల్లడించారు. అతడిని విచారించగా 2020లో క్యాతనపల్లికి చెందిన గురజాల రవీందర్ ఇంట్లో సీసీ మెంటర్లు వారణాసి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మిలు కొందరితో భేటీ అయినట్లు చెప్పారని.. ఆ సమావేశంలో తీర్మానాలకు అనుగుణంగానే హుస్సేన్ కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.