Electricity Scam: కేసీఆర్‌పై చర్యలు?
ABN , Publish Date - Nov 02 , 2024 | 04:17 AM
‘విద్యుత్’ అవకతవకల అంశంలో జస్టిస్ మద న్ భీంరావు లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
క్యాబినెట్, శాసనసభలో చర్చించిన తర్వాతే
విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో..
జస్టిస్ లోకూర్ నివేదిక ఆధారంగా సర్కారు అడుగులు
లాభదాయకం కాని ప్రాజెక్టులకు బాధ్యులన్న కమిషన్!
కేసీఆర్‌తో పాటు ఇతర పాత్రధారులపైనా చర్యలు
మంత్రివర్గ చర్చ తర్వాత నివేదిక బయటికొచ్చే చాన్స్
కమిషన్ నివేదికపై అధికారులతో సీఎం మంతనాలు
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘విద్యుత్’ అవకతవకల అంశంలో జస్టిస్ మద న్ భీంరావు లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి, ఆయా నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అనంతరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి, తాము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది సభలోనే ప్రకటించాలని సర్కారు భావిస్తోంది. జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ గడువు అక్టోబరు 29తోనే ముగియగా ఆ లోపే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్న కమిషన్ నివేదిక రూపొందించింది. జస్టిస్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ తొలుత ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా, జస్టిస్ మద న్ భీంరావు లోకూర్ కమిషన్ నివేదికలోని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి అధికారులతో చర్చించారు.
తదుపరి చర్యలు తీసుకునే అంశంపై మంతనాలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఛత్తీ్‌సగఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందంలో తప్పిదాలేంటి? 2000 మెగావాట్ల కోసం కారిడార్‌ను బుక్ చేసుకొని, ఆ మేరకు విద్యుత్ తీసుకోకుండా జరిమానాల రూపంలో పవర్ గ్రిడ్‌కు చెల్లించింది ఎంత? పిట్‌హెడ్(బొగ్గు గనుల ఉదరభాగంలో) విధానంలో కాకుండా సుదూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న కారణంగా ప్రజలపై ఏ మేరకు భారం పడనుంది? కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల కలిగిన నష్టమేంటి? నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడం వల్ల జరిగిన నష్టాలేంటి? తదితర అంశాలపై విచారణకు ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ సూచనల మేరకు విచారణ ప్రారంభించిన కమిషన్.. బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయాలు స్వీకరించింది. అఫిడవిట్ల రూపంలో వివరాలు అందించిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. ఈ క్రమంలో తెలంగాణ విద్యుత్ రంగ నిపుణుడు కంచర్ల రఘు, తెలంగాణ జనసమితి అఽధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్, తిమ్మారెడ్డి ఆయా అంశాల్లో కేసీఆర్ చేసిన తప్పిదాలను కమిషన్‌కు నివేదించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ లాభదాయం కానీ ఆయా ప్రాజెక్టుల అంశంలో తీసుకున్న నిర్ణయాలకు మాజీ సీఎం కేసీఆర్ బాధ్యులని తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. సదరు నివేదికను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే నివేదికలోని అంశాలు బయటికొచ్చే అవకాశముంది.
20 ఏళ్లలో తొలిసారి
విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులు విసిరిన సవాలును స్వీకరించిన ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని మొదలైన కమిషన్ విచారణ కీలక దశలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన కమిషన్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత జూలై 29న జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ బాధ్యతలు స్వీకరించి మూడు నెలల్లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అవినీతి అక్రమాలపై ఏర్పాటైన కమిషన్ ప్రభుత్వానికి సకాలంలో నివేదిక సమర్పించడం పదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పదేళ్ల తెలంగాణ చరిత్రలో మొత్తంగా 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక, కాళేశ్వరంపై వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా నాలుగైదు నెలల్లోపే ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.