Share News

High Court: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై యథాతథ స్థితి

ABN , Publish Date - Aug 25 , 2024 | 03:59 AM

ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) ముందుకు వెళ్లకుండా యథాతథ స్థితి(స్టేటస్‌ కో) విధిస్తూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

High Court: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై యథాతథ స్థితి

  • హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) ముందుకు వెళ్లకుండా యథాతథ స్థితి(స్టేటస్‌ కో) విధిస్తూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేపడుతున్నారని పేర్కొంటూ ఎన్‌ కన్వెన్షన్‌ మాతృసంస్థ ఎన్‌.3 ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ నల్ల ప్రీతమ్‌రెడ్డి హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.


రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలోని 291/1 11/2, 11/3, 11/36 సర్వే నంబర్లలో 27,063 చదరపు మీటర్లలో ఉన్న ఆస్తిని అక్రమంగా కూల్చివేస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ ఓ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అని.. 2009లో అక్కినేని నాగార్జున నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో ఎన్‌ కన్వెన్షన్‌ హాల్‌ నిర్మించినట్లు పేర్కొన్నారు. తమకు లీజుకు ఇచ్చిన స్థల యజమాని నాగార్జున రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా స్థలం కొని, అన్ని అనుమతులతో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.


తమ ఆస్తి పక్కనే సర్వే నంబర్‌ 36లో తమ్మిడికుంట ఉందని.. కొన్ని దశాబ్దాల కిందే దానికి బండ్‌ కట్టారని.. దానికి సంబంధించిన నీళ్లు తమ ఆస్తిలోకి ఎప్పుడూ రాలేదని తెలిపారు. ‘‘2014లో సైతం తమ్మిడికుంట ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎ్‌ఫటీఎల్‌)లో ఎన్‌ కన్వెన్షన్‌ ఉందని అధికారులు హద్దులు పెట్టారు. మేం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా అప్పటి ప్రభుత్వం ఎఫ్‌టీఎల్‌ హద్దులు ఖరారు చేయలేదని, హద్దులు ఖరారు చేసే పక్షంలో నోటీసులు ఇస్తామని వివరణ ఇచ్చింది. సదరు వివరణతో రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు ముగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్‌ గుర్తించలేదు.


గుర్తిస్తే నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూకట్‌పల్లి కోర్టులో మరో సివిల్‌ సూట్‌ కొనసాగుతోంది. 2007 నాటి జీవో నెంబర్‌ 901 ప్రకారం పెనలైజేషన్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం కింద జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నాం. ఈ దరఖాస్తును ఎలాంటి కారణాలు లేకుండా తిరస్కరించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. మళ్లీ దరఖాస్తు పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘకాలం దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న తర్వాత 2021లో జీహెచ్‌ఎంసీ అధికారులు మళ్లీ తిరస్కరించారు. అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణ నిబంధనలు-2015 కింద ప్రభుత్వానికి అప్పీల్‌ చేశాం.


అప్పీల్‌ను స్వీకరించిన ప్రభుత్వం 2021 ఆగస్టు 7న స్టేటస్‌ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్టేటస్‌ కోతోపాటు ఎఫ్‌టీఎల్‌ నివేదికపై సివిల్‌ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో హైడ్రా అనే సంస్థ ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చబోతోందని మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. మా చట్టబద్ధమైన హక్కులను హరించేలా ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేతలు ప్రారంభించారు’’అని పిటిషనర్‌ తెలిపారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం.. యథాతథస్థితి విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. ప్రహరీ నిర్మాణానికి అనుమతివ్వాలని పిటిషనర్‌ న్యాయవాది విజ్ఞప్తిచేయగా ధర్మాసనం తిరస్కరించింది.

Updated Date - Aug 25 , 2024 | 03:59 AM