డీహెచ్ పరిధిలోని ఆస్పత్రుల్లో ‘అబాస్’
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:49 AM
ప్రజారోగ్య సంచాలకుల(డీహెచ్) పరిఽధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్(అబా్‌స)ను తక్షణమే అమలు చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

33 జిల్లాల డీఎంహెచ్‌వోలకు సర్క్యులర్ జారీ
విధులకు డుమ్మా కొట్టే డాక్టర్లు, సిబ్బందికి చెక్
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య సంచాలకుల(డీహెచ్) పరిఽధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్(అబా్‌స)ను తక్షణమే అమలు చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం డీహెచ్ రవీందర్‌నాయక్ 33 జిల్లాల వైద్యాధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, యూపీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల(బస్తీ, పల్లె దవాఖానాల)లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్(అబా్‌స)ను అమలు చేయాలని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన విధానం విజయవంతమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
విధులు నిర్వరిస్తున్న ఆస్పత్రులకు వైద్య సిబ్బంది వెళ్లినప్పుడే హాజరు నమోదవుతుందని, ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని ఏర్పాటు చేసుకోవాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించారు. కాగా, గత నెల 16న ‘‘పీహెచ్‌సీలకు చుట్టాలుగా వైద్యులు’’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు పీహెచ్‌సీలకు రావడం లేదని అందులో పేర్కొంది. దీనిపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ మరుసటి రోజే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అన్ని ఆస్పత్రుల్లో ‘అబాస్’ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. కాగా, ఉద్యోగులతో చర్చించకుండా అబాస్ విధానం అమలు చేయడం సరికాదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫసియుద్దీన్, ప్రధాన కార్యదర్శి యాదనాయక్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.