Share News

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎన్ని అపశ్రుతులో..

ABN , Publish Date - Aug 15 , 2024 | 11:07 AM

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.

Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎన్ని అపశ్రుతులో..

హైదరాబాద్: 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ మువ్వెన్నల జెండా ఎగుర వేశారు. నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ జెండాను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఆవిష్కరించారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇక పలు చోట్ల అపశ్రుతలు చోటు చేసుకున్నాయి.


తెలంగాణలో పలు చోట్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అపశ్రుతులు దొర్లాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంకు పైన జెండా ఆవిష్కరణలో భాగంగా ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి కేలోత్ నరేష్ ( ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగి) తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో జాతీయ జెండా సాక్షిగా కార్పొరేషన్ కార్మికుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్ కార్మికుడు గంగిపెల్లి విజయ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. హెల్త్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ వేతనం ఇవ్వకుండా వేధిస్తున్నాడంటూ మేయర్, కమిషనర్ ఎదుట విజయ్ పెట్రోల్ పోసుకున్నాడు. కార్పొరేషన్ సిబ్బంది గమనించి ఆత్మహత్య యత్నాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.


మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత కింద పడిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యంతో జాతీయపతాకానికి అవమానం జరిగింది. సిద్దిపేటలో సైతం జాతీయ పతాకానికి అవమానం జరిగింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా తలకిందులుగా ఎగరవేశారు. సూర్యాపేట జిల్లాలో జాతీయ జెండాకు, మహాత్మాగాంధీ చిత్రపటాలకు అవమానం జరిగింది. తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జెండా ఎగరేసి అధికారులు, సిబ్బంది వెళ్లిపోయారు. ఎవరూ లేకుండా వెళ్లిపోవడంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతిపిత గాంధీ, ఫోటోలను కోతులు కిందపడేసి పాడు చేశాయి.

Updated Date - Aug 15 , 2024 | 11:07 AM