మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదం
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:10 PM
మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని అదనపు ఎస్పీ రాములు అన్నారు.

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ ప్రమాదంలో పడుతోందని అదనపు ఎస్పీ రాములు అన్నారు. బుధవారం ఎదిర సమీపంలోని తిరుమల హిల్స్‌లో గల ప్రభుత్వ వైద్య కళాశాల సమావేశ మందిరంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వళన చేసి, ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత పెడదారి పడుతోందని, ముఖ్యంగా వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతోందన్నారు. ఈ క్రమంలో యువత విద్యా, ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవాలని, ఇందులో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు, నియంత్రణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు, పోలీసు, వైద్యశాఖ, ఎక్సైజ్ శాఖలు చేపడుతున్న చర్యలు, చట్టాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు పోస్టర్ ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సంక్షేమాధికారి జరీనా, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, వైద్యకళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, టీజీఎన్‌ఏబీ డీఎస్పీ బుచ్చయ్య, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్ పాల్గొన్నారు.