గర్భిణులకు తప్పని అవస్థలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 11:20 PM
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో కొన్ని నెలలుగా అలా్ట్రసౌండ్ స్కానింగ్ జరగడం లేదు. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సీహెచ్‌సీలో నిలిచిపోయిన అలా్ట్రసౌండ్ స్కానింగ్
గత్యంతరం లేక 52 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి
పట్టించుకోని అధికారులు
ముంచంగిపుట్టు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో కొన్ని నెలలుగా అలా్ట్రసౌండ్ స్కానింగ్ జరగడం లేదు. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక కొందరు సుమారు 52 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. మండలంలోని గర్భిణులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
మండలంలోని పలు ప్రాంతాల నుంచి గర్భిణులు ప్రతి నెలా 50 నుంచి 60 మంది అలా్ట్రసౌండ్ స్కానింగ్ కోసం సీహెచ్‌సీకి వస్తుంటారు. అయితే గత కొన్ని నెలలుగా ఇక్కడ అలా్ట్రసౌండ్ స్కానింగ్ జరగడం లేదు. గతంలో ప్రతి మంగళవారం, గురువారం గర్భిణులకు అలా్ట్రసౌండ్ స్కానింగ్ చేసి శిశువు పరిమాణం, గుండె స్పందన, శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలియజేసేవారు. దీంతో గర్భిణులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్ లేకపోవడంతో పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి గైనకాలజిస్ట్ వచ్చి ఆ రెండు రోజులు గర్భిణులకు స్కానింగ్‌లు తీసేవారు. అయితే గత ఐదు నెలలుగా అక్కడ నుంచి గైనకాలజిస్ట్ రావడం లేదు. దీంతో స్కానింగ్‌లు జరగడం లేదు. వైద్యుల సూచన మేరకు కొందరు సుదూర ప్రాంతంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంటున్నారు. అంత దూరం వెళ్లడం చాలా కష్టంగా ఉంటోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్య విధాన పరిషత్ అధికారులు స్పందించి ఇక్కడ గైనకాలజిస్ట్‌ను నియమించాలని, అలా్ట్రసౌండ్ స్కానింగ్‌ను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారిణి గీతాంజలిని వివరణ కోరగా గైనకాలజిస్ట్ లేక అలా్ట్రసౌండ్ స్కానింగ్ సేవలు ప్రస్తుతం నిలిచాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు.