HYderabad : కేంద్రం కనికరించేనా!
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:20 AM
కేంద్రంతో గత ప్రభుత్వంలా కాకుండా.. ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నాం. పలు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల అమలుకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందా?
‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులువెనుకబడిన జిల్లాలకు రూ.2,250 కోట్లు
కేంద్రం కనికరించేనా!
కొత్త బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు.. ఇప్పటికే కేంద్రం దృష్టికి పలు డిమాండ్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధులు
వెనుకబడిన జిల్లాలకు రూ.2,250 కోట్లు
పీఎంఏవై కింద 25 లక్షల ఇళ్లకు విన్నపం
సీఎ్‌సఎస్ నిధులను పెంచాలని అభ్యర్థన
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్రంతో గత ప్రభుత్వంలా కాకుండా.. ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నాం. పలు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల అమలుకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందా? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధానికి, కేంద్ర మంత్రులకు చేసిన విజ్ఞప్తులపై స్పందిస్తుందా? కొన్ని ప్రాజెక్టులకైనా నిధులు ఇస్తుందా? ప్రత్యేక గ్రాంట్లు, సీఎ్‌సఎ్‌సల కింద నిధులు కేటాయిస్తుందా? అని రాష్ట్ర ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది.
ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండడంతో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇదివరకటిలా కాకుండా ఈసారి తమపై కనికరం చూపాలని కోరుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఓట్-ఆన్-అకౌంట్’ బడ్జెట్‌లో కేటాయింపులపై స్పష్టత రానందున.. ఈ పూర్తి స్థాయి బడ్జెట్‌లోనైనా నిధులు వస్తాయని ఆశిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క.. పలుమార్లు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర డిమాండ్లను వివరించారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా తమ గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎ్‌సఎ్‌స)ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదని తెలిపారు. సీఎ్‌సఎ్‌సల కింద కేంద్రం నిధులను మంజూరు చేసినా.. రాష్ట్రం తన మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. తాము సీఎ్‌సఎ్‌సలకు మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేస్తామన్నారు. ఈ దృష్ట్యా సీఎ్‌సఎ్‌సల కింద గ్రాంట్లను మరింత పెంచి విడుదల చేయాలని కోరారు.
పీఆర్‌ఎల్‌ఐకి జాతీయ హోదా ఇవ్వండి
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఒక్క సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఈ దృష్ట్యా ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతోంది. దీని ద్వారా.. కరువు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉందని తెలిపింది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆరు జిల్లాల్లోని 1,226 గ్రామాలతోపాటు హైదరాబాద్ మహా నగరానికి తాగు నీటిని సరఫరా చేయా ల్సి ఉందని చెబుతోంది. ఇక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లతో చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించాలని రాష్ట్రం కోరుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెబుతోంది.
మరోవైపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్‌జీఎఫ్)’ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులివ్వాలని రాష్ట్రం కోరుతోంది. రాష్ట్రంలోని తొమ్మిది పాత ఉమ్మడి జిల్లాలకు ఒక్కో జిల్లా కు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ. 450 కోట్లు రావాలని గుర్తు చేస్తోంది. 2019-20 నుంచి ఐదేళ్లకు సంబంధించి మొత్తం రూ.2,250 కోట్లు రావాల్సి ఉందని తెలిపింది. వీటిని ఈ బడ్జెట్‌లో కేటాయించాలని కోరుతోంది.
ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి
2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతాల (ఐటీఐఆర్)ను మంజూరు చేసిందని ప్రధాని మోదీకి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఐటీ రంగంలో నూతన కంపెనీలు, డెవలపర్లను ప్రోత్సహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 3 క్లస్టర్లలో అందుకు అవసరమైన భూమిని గుర్తించిందని పేర్కొన్నారు. 2014 తర్వాత ఐటీఐఆర్ ముందుకు సాగలేదని, హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది.
మరోవైపు రాష్ట్ర పునర్విభజన సమయంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని నాటి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీకి బదులు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షా్‌పను ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జూలైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ.. కాజీపేటలో మాత్రం సాధ్యం కాదనడం సరికాదన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని కోరారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కూడా ప్రధానికి గుర్తు చేశారు. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రం కోరుతోంది.
ఇక రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు పనులను త్వరితగతిన ప్రారంభించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. నిర్మాణానికి అవసరమైన నిధులను ఎన్‌హెచ్‌ఏఐకు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలోని 15 రాష్ట్ర రహదారుల(స్టేట్ హైవేల)ను జాతీయ రహదారులు (నేషనల్ హైవేలు)గా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ రోడ్ల వివరాలను ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా ఈ రోడ్లను ఉన్నతీకరించాలని అడుగుతోంది. వీటితోపాటు హైదరాబాద్-బెంగుళూరు రహదారిని 12 లేన్లుగా విస్తరించే పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, దీనికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరుతోంది. ఇక హైదరాబాద్-విజయవాడ రహదారిలో ఆరు లేన్ల విస్తరణ పనులకు టెండర్లను ఆహ్వానించాలని కోరుతోంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇటీవల కేంద్రం... పాత కాంట్రాక్టును రద్దు చేసి, కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ పనులను వేగంగా చేపట్టాలని కోరింది.
భూ సర్వేకు 300 కోట్లు కేటాయించాలి
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్, రికార్డుల అప్‌డేట్ తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం ప్రతిపాదనలు రూపొందించింది. కేంద్రం అన్ని రాష్ట్రాల్లో భూ సర్వే చేపట్టి భూ రికార్డులను అప్‌టేడ్ చేసేందుకు డీఐఎల్‌ఆర్‌ఎంపీ (డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డు మోడ్రనైజేషన్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రక్రియను 2025-26 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది. అందులో భాగంగా రాష్ట్రానికి రావల్సిన నిధులతో పాటు అదనపు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఇతర డిమాండ్లు
రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)ను ఏర్పాటు చేయాలి. ఇప్పటివరకు ఒక్క ఐఐఎం కూడా రాలేదు.
కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. మొత్తం 24 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలి.
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన రూ.347.54 కోట్లను ఇవ్వాలి.
స్మార్ట్ సిటీల కింద వరంగల్, కరీంనగర్‌లకు నిధులు ఇవ్వాలి.
పారిశ్రామిక కారిడార్లకు నిధులివ్వండి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి రెండు పారిశ్రామిక కారిడార్లను నిర్మించాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. వీటిని పూర్తి చేస్తే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అంటోంది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ మీదుగా విజయవాడ వరకు నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరుతోంది. హైదరాబాద్- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కూడా తుది అనుమతులు మంజూరు చేయాలని అడుగుతోంది.
దీంతో రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని ఆశిస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద ఎక్కువ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతోంది. కేంద్ర నిబంధనల మేరకే తాము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధానిని కలిసిన సందర్భంగా చెప్పారు.
‘ఓట్-ఆన్-అకౌంట్’ బడ్జెట్‌లో పీఎంఏవై కింద మొత్తం 2 కోట్ల ఇళ్లను కేంద్రం ప్రకటించింది. రూ.80,967 కోట్లతో వీటిని చేపడతామని పేర్కొంది. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్‌లో తెలంగాణకు 25 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్రం కోరుతోంది. కాగా, కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, ఈ పార్కులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే.. భూములు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
దీంతోపాటు పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కుకు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చిందని, దానికి గ్రీన్ ఫీల్డ్ హోదా ఇవ్వాలని కోరుతోంది. దీంతో గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయని చెబుతోంది.